– 565 బైపాస్ రోడ్డు పనులను అడ్డుకున్న బాధితులు
నీలగిరి, జూలై 19 : జాతీయ రహదారి 565 పానగల్లు నుండి సాగర్ రోడ్డు వరకు భూములు కోల్పోతున్న బాధితులకు నష్ట పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని శనివారం భూ నిర్వాసితుల పోరాట కమిటీ గౌరవాధ్యక్షుడు సయ్యద్ హాశం, కో కన్వీనర్లు దోనాల నాగార్జున రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పనులను అడ్డుకున్నారు. సుమారు రెండు వందల మంది బాధితులు గిరకబాయిగూడెం హౌసింగ్ బోర్డు మధ్యలో జాతీయ రహదారి 565 కాంట్రాక్టర్ క్యాంప్ కార్యాలయం వద్దకు వెళ్లి వాహనాలు బయటకు రాకుండా అడ్డుకుని నిరసన తెలిపారు. తమకు న్యాయం జరిగేంత వరకు పనులు నిలిపివేయాలని నినాదాలు చేశారు. క్యాంప్ కార్యాలయ మేనేజర్ సత్యం అందోళన విరమించాలని బాధితులను కోరారు. నష్ట పరిహారం తమ పరిధిలోనిది కాదని చెబుతూ వారితో చర్చలు జరిపారు.
సుమారు 14 కిలోమీటర్ల బైపాస్ రోడ్డులో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పూర్తి నష్ట పరిహారం చెల్లించిన తర్వాతే రోడ్డు పనులు ప్రారంభించాలని బాధితులు కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కలెక్టర్ హామీ మేరకు సుమారు 1,250 మంది నిర్వాసితులు ఉన్నట్లు గుర్తించారని, వారందరికి నష్ట పరిహారం సంతృప్తికరంగా అందేవరకు రోడ్డు పనులు నిలిపివేయాలన్నారు. బాధితులందరికీ నష్ట పరిహారం అందిన తర్వాతే రోడ్డు నిర్మాణం ప్రారంభిస్తామని, అంతవరకు ఏ ఒక్క రైతు భూమిలో కూడా రోడ్డు వేయమని మేనేజర్ సత్యం హామీ ఇవ్వడంతో అందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో 565 జాతీయ రహదారి భూ నిర్వాసితుల పోరాట కమిటీ గౌరవ సలహాదారులు దండెంపల్లి సత్తయ్య, మాజీ కౌన్సిలర్ ఊట్కూరి వెంకట్ రెడ్డి, కోశాధికారి కన్నయ్య, కమిటీ సభ్యులు బోజ్జ మహేశ్, లింగారెడ్డి, ఊట్కూరి నారాయణరెడ్డి, యాదగిరిరెడ్డి, జగన్, నర్సిరెడ్డి, కిరణ్, శ్రీనివాస్‌రెడ్డి, మహేశ్ పాల్గొన్నారు.