తుంగతుర్తి, జనవరి 02 : వాహనదారులు, పాదచారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూర్యాపేట జిల్లా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె.సంపత్ గౌడ్, బి.నవిత అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కలిగించి వారిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బైక్పై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్టు ధరించాలన్నారు.
రోడ్డు భద్రత నిబంధనలు పాటించినట్లయితే సురక్షితంగా ప్రయాణం చేసి ఇంటికి చేరవచ్చన్నారు. ముఖ్యంగా సెల్ఫోన్ డ్రైవింగ్ చేయొద్దన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే ఆటోలు, ఇతర ప్రైవేట్ రవాణా వాహనాలు పరిమితికి మించి తీసుకెళ్లకూడదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.