కట్టంగూర్, జనవరి 10 : సంక్రాంతి సందర్భంగా జాతీయ రహదారిపై భద్రత చర్యలు చేపట్టాలని నల్లగొండ ఆర్టీఓ యారాల అశోక్ రెడ్డి అన్నారు. శనివారం కట్టంగూర్లోని నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆయన పరిశీలించి భద్రతా ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలో ఉన్న బ్లాక్ స్పాట్స్, యూటర్న్ ల వద్ద ప్రత్యేకంగా పోలీస్ పికెట్ తో పాటు రేడియం స్టిక్కర్లు, బారీకేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా ప్రమాదాలు జరిగి వాహనాలు రహదారిపై నిలిచిపోతే వెంటనే వాటిని పక్కకు జరిపి ట్రాఫిక్ పునరుద్దరించేందుకు క్రేన్ ను అందుబాటులో ఉంచుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.
ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది మెడిసన్ తో పోలీస్ పికెట్ల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్థానిక ప్రజలు, రైతులు జాతీయ రహదారిపై వెళ్లకుండా ఇతర మార్గాల ద్వారా వెళ్లాలన్నారు. వాహనదారులు వేగ నియంత్రణ పాటించి సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలన్నారు. ఆయన వెంట తాసీల్దార్ పుష్పలత, కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్. పోలీస్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.