నీలగిరి, ఏప్రిల్ 18 : రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని, రహదారి నియమాలు పాటిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని నల్లగొండ ట్రాపిక్ సీఐ మహాలక్ష్మయ్య అన్నారు. నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో చివరి రోజు శనివారం పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అనే విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. హెల్మెట్ వినియోగం లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాలలో నల్లగొండ జిల్లాలో ప్రతి సంవత్సరం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. విద్యార్థులకు రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ వినియోగించడం ట్రాఫిక్ సిగ్నల్స్ ను గౌరవించడం. స్కూల్ కు వెళ్లే సమయంలో ఇరుపక్కల చూసుకొని జాగ్రత్తగా దాటడం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం కారులో ప్రయాణించే సమయంలో సీట్ బెల్ట్ వినియోగించడం, స్కూల్ బస్సులో ఎక్కడం, దిగడం సమయంలో పాటించాల్సిన భద్రతా నియమాలు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యతను వివరించారు. చిన్న వయస్సులోనే రోడ్డు భద్రత నియమాలను తెలుసుకొని వాటిని కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ఫోన్ మాట్లాడుతూవల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ పై ప్రత్యేక హెచ్చరికలు చేశారు. టూటౌన్ ఎస్ఐ వై. సైదులు మాట్లాడుతూ ఆటో, టాక్సీ డ్రైవర్లు, బైక్ రైడర్లతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జీబ్రా క్రాసింగ్ వినియోగం, రోడ్డు దాటే నియమాలపై ప్రజలకు డెమో ద్వారా వివరించారు. ఈకార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ విజయభాయి. పోలీసులు, వాహనదారులు, పాదా చారులు విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.