చివ్వెంల, జనవరి 10 : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు వలస కూలీలు దుర్మరణం చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రంలోని కలహంది కోరాపూట్ జిల్లా బీసింగ్పూర్ తాలూకాకు చెందిన 32 మంది వలస కూలీలు అక్కడి నుంచి గుప్తా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(సీజీ17కేఎస్7719)లో గురువారం హైదరాబాద్కు బయల్దేరారు. బస్సు శుక్రవారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం శివారులోకి రాగానే ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆంగోతుతండా వద్ద 3:30 గంటల సమయంలో ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. బస్సు అతివేగంతో ఉండడంతో కొంత దూరం వరకు అలాగే దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. 18 మంది గాయపడ్డారు. మృతులు రూపు హరిజన్(51), సుల హరిజన్ (46, మహిళ), సునామణి హరిజన్ (61, మహిళ), ప్రత్యూష్ ప్రభాత్ హరిజన్ (17), బస్సు డ్రైవర్ సునీల్ గోర్డా(37)గా గుర్తించారు. రోహిత్, పింటూ బంజారా తీవ్రంగా గాయపడడంతో హైదరాబాద్ తరలించారు. మిగతా క్షతగాత్రులకు సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రయాణికుడు తల్వాడా కనియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ మహేశ్వర్ తెలిపారు. ప్రమాద స్థలాన్ని డీఎస్పీ రవి సందర్శించి వివరాలు సేకరించారు.
ఒడిశా నుంచి బయల్దేరిన ట్రావెల్స్ బస్సుకు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్సు ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించే సమయానికి డ్రైవర్ మారాల్సి ఉంది. కానీ డ్రైవర్ మారలేదని, చాలాదూరం నుంచి ప్రయాణం చేయడం వల్ల ముందున్న లారీని గుర్తించలేకపోయాడని మిగతా కూలీలు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరు నుంచి సంగారెడ్డికి ఇసుక లోడుతో వెళ్తున్న లారీ(టీఎస్ 05యూడీ 3699) టైర్ ఆంగోతుతండా వద్ద పేలింది. డ్రైవర్ అప్రమత్తమై లారీని రోడ్డుకు ఎడమ వైపున ఆపితే ప్రమాదం జరిగేది కాదని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా కుడి వైపునే లారీని నిలిపాడని, బస్సు డ్రైవర్ గమనించకపోవడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు.