నల్లగొండ సిటీ, జనవరి 02 : చలికాలం నేపథ్యంలో ఉదయం, రాత్రి వేళల్లో ఏర్పడే పొగమంచు కారణంగా రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులకు స్పష్టత తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పొగమంచు వల్ల రోడ్డుపై వాహనాలు, పాదచారులు, జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా కనిపించవని, ముందు లేదా ఆగి ఉన్న వాహనాల మధ్య దూరాన్ని అంచనా వేయడం కష్టమవుతుందన్నారు. అయితే డ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు ఈ సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకోవాలని ఆయన సూచించారు.
1. గమ్యస్థానానికి వెళ్లే సమయంలో కొద్దిగా ముందుగానే బయల్దేరాలి
పొగమంచు కారణంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున ముందుగానే బయలుదేరితే తొందరపాటు డ్రైవింగ్ నివారించవచ్చు.
2. అతివేగం, ఓవర్ టేకింగ్‌కు దూరంగా ఉండాలి
ముందున్న వాహనాలు సరిగా కనిపించకపోవడం వల్ల వేగంగా వెళ్లడం లేదా ఓవర్‌టేకింగ్ చేయడం ప్రమాదకరం.
3. లో బీమ్ లైట్లను మాత్రమే ఉపయోగించాలి
హై బీమ్ లైట్ల వల్ల కాంతి పొగమంచులో ప్రతిఫలించి చూపు మరింత తగ్గుతుంది. లో బీమ్ లేదా ఫాగ్ లైట్లు ఉన్నచో వాటిని ఉపయోగించాలి.
4. ముందు వాహనానికి తగిన సురక్షిత దూరాన్ని పాటించాలి
ముందున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే ఢీకొట్టే ప్రమాదాన్ని నివారించవచ్చు.
5. నిర్దేశిత లేన్లలోనే వాహనం నడపాలి
లేన్ క్రమశిక్షణ పాటించకపోతే ముందున్న వాహనాల కదలికను అంచనా వేయడం కష్టం అవుతుంది.
6. వాహనం నడిపేటప్పుడు కిటికీ అద్దాలను కొద్దిగా దించాలి
దీనివల్ల పొగమంచు ఒకేచోట కేంద్రీకృతం కాకుండా విచ్ఛిన్నమై డ్రైవర్‌కు స్పష్టత పెరుగుతుంది.
7. పొగమంచు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే వాహనాన్ని ఆపి తర్వాత కొనసాగించాలి
ముందున్న వాహనాలు లేదా రోడ్డు స్పష్టంగా కనిపించకపోతే ప్రయాణం కొనసాగించకూడదు.
8. ముందు మరియు వెనుక అద్దాలను శుభ్రంగా ఉంచుకోవాలి
వైపర్లు, డీ-ఫ్రాస్టర్లను అవసరానికి అనుగుణంగా ఉపయోగిస్తూ అద్దాలు క్లియర్‌గా ఉంచాలి.
9. ఇండికేటర్లను ముందుగానే ఉపయోగించాలి
మీరు ఎటువైపు మలుపు తీసుకుంటున్నారో వెనుక వాహనదారులకు ముందుగా తెలియజేయాలి.
10. సడన్ బ్రేకింగ్‌కు దూరంగా ఉండాలి
చలికాలంలో రోడ్లు తడిగా ఉండటం వల్ల వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. బ్రేక్‌లను నెమ్మదిగా ఉపయోగించాలి.