మిర్యాలగూడ, ఏప్రిల్ 1: ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్మకునేందుకు రైసు మిల్లర్ల వద్దకు వెళ్తే మిల్లర్లు చెప్పిన ధరకే రైతు లు ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. గత 15 రోజులుగా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోని రైసుమిల్లుల్లో సన్నధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యా యి. మంగళవారం మిల్లర్లతో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమావేశమై రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. అయితే ఎమ్మెల్యే మిల్లర్లతో సమావేశైన మరుసటి రోజే అంటే బుధవారమే ధాన్యం ధరను క్వింటాకు రూ.250 తగ్గించారు. గత 15 రోజులుగా రూ.2700 వరకు పలికిన సన్నధాన్యం ధర ఒకేసారి మిల్లర్లు సిండికేట్‌గా మారడంతో రూ.250 ధర తగ్గించారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.
మిల్లర్ల సిండికేట్ కావడం వల్లే..
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద 3.20లక్షల ఎకరాల్లో రైతులు సన్నాలను సాగు చేశారు. కాగా గత 15 రోజులుగా ఆయకట్టు ప్రాంతంలో సన్నధాన్యం కోతలు ప్రారంభమయ్యాయి. 15 రోజుల నుంచి రైతుల నుంచి ధాన్యాన్ని మిల్ల ర్లు రూ.2,650 నుంచి రూ.2,750 వరకు కొనుగోలు చేశారు. గత రెండు రోజులుగా ధాన్యం రాక కొద్దిగా పెరిగడంతో ఇదే అదనుగా మిల్లర్లు సిండికేట్‌గా మారి రూ.2,500 ధర నిర్ణయించారు.
పచ్చగింజ పేరుతో ధర తగ్గింపు..
కాగా కొంతమంది మిల్లర్లు పచ్చ గింజ పేరుతో రైతుల ధాన్యం రేటును రూ.2,350కే నిర్ణయిస్తున్నారు. పచ్చగింజ పేరుతో రూ.2350 నుం చి రూ.2,450 వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే మీ ఇష్టం ఉన్నచోట అమ్ముకోండంటూ మిల్లర్లు బెదిరిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో సన్నధాన్యానికి గిరాకీ బాగానే ఉంది. ఇందుకు అనుగుణంగా సన్నధాన్యానికి గిట్టుబాటు ధర అందించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయా ల్సి ఉంది. ధాన్యం ట్రాక్టర్లు అధికంగా రావడంతో మిల్లర్లు ఏకంగా క్వింటాకు రూ.250కు పైగా ధర తగ్గించి సన్నధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే ఆదేశాలకే దిక్కులేదు..
మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మంగళవా రం మిల్లర్లతో సమావేశమై రైతులను ఇబ్బందులు పెట్టవద్దని, గిట్టుబాటు ధర అందించాలని చెప్పినట్లు ప్రకటన విడుదల చేశారు. అయితే ఎమ్మెల్యేతో సమావేశమైన తెల్లారే రూ.250 ధర తగ్గించడం ఏమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు లు సాగు చేస్తున్న హైబ్రిడ్ రకం సన్నధాన్యానికి పెట్టుబడులు సైతం ఎక్కువగానే ఉంటున్నాయి.
ఒక్కసారే ధర తగ్గింపు..
మిల్లర్లు 15రోజులు రూ.2700కు పైగా ధర చెల్లించి, నేడు ఒక్కసారిగా తగ్గించి కొనుగోలు చేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. మిల్లర్లను ప్రశ్నిస్తే మద్దతు ధరకు మించి కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు. సన్నధాన్యాన్ని ఎప్పుడైనా మద్దతు ధరకు మించి గిట్టుబాటు ధర చెల్లించి మిల్లర్లు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం మిల్లర్లు సిండికేట్ కావడంవల్లే ఒకేసారి క్వింటాకు రూ.250 ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నా రు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ధాన్యం కొనుగోళ్లపై దృష్టిసారించి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపట్టాలన్నారు.
తక్కువ ధరకే కొనుగోలు చేశారు..
ఆరుగాలం కష్టించి పండించి మిల్లు దగ్గరికి తీసుకుపోతే రూ.2500కే కొనుగోలు చేశారు. గత 15రోజుల నుంచి క్వింటా ధాన్యాన్ని రూ.2750కే కొనుగోలు చేశారు. బుధవారం ఒకేసారి క్వింటాకు రూ.250 ధర తగ్గించి కొనుగోలు చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే అమ్ముకో లేకపోతే లేదంటూ బెదిరిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో మిల్లర్లు అడిగిన ధరకే ధాన్యాన్ని విక్రయించా.
-బంటు శ్రీను, రైతు, శెట్టిపాలెం
రైతులను దోపిడీ చేస్తున్న మిల్లర్లు
మిర్యాలగూడ, ఏప్రిల్ 1: రైతులను మిల్లర్లు నిలువునా దోపిడీ చేస్తున్నారని రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ఆయన మిర్యాలగూడలోని పలు రైసు మిల్లుల వద్దకు వెళ్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిర్యాలగూడలో వారం రోజుల క్రితం క్వింటా ధాన్యానికి రూ.2750 ఖరీదుతో కొనుగోలు చేశారని, మిల్లర్లు రోజుకు రూ.100 తగ్గించుకుంటూ వస్తూ మంగళవారం ఒక్కసారే రూ.200 తగ్గించారని, బుధవారం రూ.2400 నుం చి రూ.2250 వరకు ఖరీదు చేశారని అన్నారు. కష్టించి పండించిన ధాన్యానికి అనేక కొర్రీలు పెడుతూ కొనుగోలు చేస్తున్నారని పేర్కొ న్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు మంచి రేటు వచ్చేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కండ స్వామి, వేణు, కిరణ్, వెంకటయ్య, వేణు, రవి, గోవింద్, నగేష్, రామకృష్ణ, వరప్రసాద్, వరుణ్, సింహాద్రి పాల్గొన్నారు.
మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
మిర్యాలగూడ, ఏప్రిల్ 1: డివిజన్లోని సన్నరకం ధాన్యం ధర తగ్గిస్తూ రోజుకో విధానాన్ని పాటిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తు న్న మిల్లర్లపై తగిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ కు ఆయన వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ డివిజన్లో యాసంగి సీజన్ వరి కోతలు ము మ్మరంగా సాగుతున్నాయన్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో ఆయకట్టు, నాన్ ఆయకట్టు కింద వరి సన్న రకాలైన జేఎస్ఆర్, చింట్లు, హెచ్ఎంటీ రకాలను రైతులను ఎక్కువగా సాగు చేస్తున్నారని అన్నారు.
15 రోజుల నుంచి వరి కోతలు ప్రారంభం కాగా ప్రారంభంలో మంచి ధరకు కొనుగోలు చేసిన మిల్ల ర్లు, ఐదు రోజుల క్రితం సన్న రకం జేఎస్ఆర్, కావేరి టిల్లు వంటి సన్నరకం ధాన్యానికి ధర రూ.2750కుపైగా కొనుగోలు చేశారని అన్నా రు. కానీ రోజురోజుకూ ధాన్యం ట్రాక్టర్లు మిల్లుల వద్దకు ఎక్కువ సంఖ్యలో రావడంతో ధర తగ్గిస్తూ వస్తున్నారని, బుధవారం క్విం టా ధాన్యం రూ.2400 నుంచి రూ.2250 లోపు అడుగుతున్నారని, ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే అమ్ముకోండి లేకుంటే వెళ్లిపొమ్మని అంటున్నారని అన్నారు. ఈ వా రంలో రూ.300 క్వింటాకు తగ్గించి మిల్లర్లు సిండికేట్‌గా మారి రోజుకో ధర అమలు చేస్తూ రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా మిల్లర్లు, ప్రజాప్రతినిధులు, రైతు ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాల్వాయి రాంరెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్ల, శ్రీనివాస్‌రెడ్డి, గోవిందరెడ్డి ఉన్నారు.