తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా మారిన సర్కారు దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. వైద్య పరికరాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ డాక్టర్లు, సిబ్బందిని నియమించింది. మారుమూల గ్రామాల్లోనూ వైద్య సేవలను మెరుగుపర్చింది. నేడు ఎక్కడ చూసినా ఓపీ సేవలతోపాటు ఇన్‌పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక జిల్లా జనరల్ దవాఖాన సరికొత్తగా మారింది. మెడికల్ కళాశాల రావడంతో రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతున్నది. మాతా శిశుసంరక్షణ, డయాలసిస్, పాలియేటివ్ కేర్ సెంటర్లు బాధితులకు ఎంతో
ఉపయోగపడుతున్నాయి. టీ డయాగ్నోస్టిక్ హబ్ అందుబాటులోకి రావడంతో వందకుపైగా వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు. పల్లె, బస్తీ దవాఖానల ఏర్పాటుతో ప్రజలకు వ్యయ ప్రయాసలు తగ్గాయి. సర్కారు వైద్యంపై ప్రజలకు పూర్తి విశ్వాసం పెరిగింది. నాడు సర్కారు దవాఖానలు వద్దన్న వారే నేడు
ధైర్యంగా వస్తున్నారు.
నీలగిరి, నవంబర్ 8 : సమైక్య పాలనలో కునారిళ్లిన ప్రజా వైద్యంలో.. నేడు స్వరాష్ట్రంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకవైపు బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, కంటి వెలుగు, ఎన్సీడీ కిట్లు, కేసీఆర్ కిట్, అమ్మఒడి, వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. మరోవైపు రోగులకు అనుగుణంగా వైద్యులను నియమించడంతోపాటు మందులు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అందుబాటులోకి తెచ్చారు. డయాలసిస్ రోగుల కోసం జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌లో డయాలసిస్ సెంటర్లు, జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో క్యాన్సర్, డయాలసిస్ సెంటర్లు, ఐసీయూ, ఎంసీహెచ్‌ను ఏర్పాటు చేసి ఇక్కడే చికిత్స అందిస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో రూ.270 కోట్లతో మెడికల్ కళాశాలను నిర్మిస్తున్నారు. పీహెచ్‌సీలను సైతం ఆధునీకరించి 24 గంటల వైద్యసేవలు అందిస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతి మంగళవారం ‘ఆరోగ్య మహిళ’ పేరుతో దీర్ఘకాలిక రోగాలపై ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు.
జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ డివిజన్లలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు, ఐసీయూలను ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించారు. మర్రిగూడలో డిజిటల్ ఎక్స్‌రే మిషన్ ఏర్పాటు చేశారు. నకిరేకల్ ఆస్పత్రిని 100 పడకలకు పెంచారు. నూతనం భవనం కోసం 6 ఎకరాల భూమిని సైతం కేటాయించగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇవే కాకుండా జిల్లాలో 18 పీహెచ్‌సీలను ఆధునీకరించి 24 గంటలపాటు వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. మిర్యాలగూడలో 30 పడకలతో చిన్నారుల కోసం ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేశారు. అదనంగా 100 పడకలు పెంచి రూ.15 కోట్లతో పనులు చేపట్టారు.
ఉమ్మడి పాలనలో సర్కారు దవాఖానకు వెళ్లాంటేనే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ఆర్థిక స్థోమత లేక తప్పని పరిస్థితిలో వెళ్లాల్సి వచ్చేది. సిబ్బంది కొరత తదితర కారణాలతో రోగులు మృత్యువాత పడేవారు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసింది. దాంతో వాటి రూపురేఖలు పూర్తిగా మారాయి. అంతేకాకుండా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మఒడి వంటి పథకాలతో సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగడమే కాకుండా సిజేరియన్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జిల్లా కేంద్ర దవాఖానను 250 పడకల నుంచి 400 పడకలకు పెంచారు. అంతేకాకుండా ఎంసీహెచ్‌ను ఆధునీకరించి అదనంగా 150 పడకలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 550 పడకలతో ప్రస్తుతం జిల్లా జనరల్ ఆస్పత్రి నిర్వహణ కొనసాగుతున్నది. 10 పడకలతో ఐసీయూ, 10 పడకలతో డయాలసిస్ సెంటర్, మరో 10 పడకలతో పాలియేటివ్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా 12 పడకలతో ఐసీయూను ఏర్పాటు చేశారు. కరోనా కాలంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఒకటి నేషనల్ హైవే అథారిటీ సహకారంతో ఏర్పాటు చేసి 550 పడకలకు ఆక్సిజన్ అందేలా చర్యలు తీసుకున్నారు. వీటితోపాటు రూ.కోటితో సీటీసాన్ మిషన్, రూ.40 లక్షలతో ఎక్స్‌రే మిషన్, మరో రూ.20 లక్షలతో మోకాలి శస్త్ర చికిత్సకు ఆపరేషన్ థియేటర్, మార్చురీ రూమ్‌ను ఆధునీకరించారు. అంతేకాకుండా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి తాతాలికంగా రూ.7కోట్లతో భవనాన్ని ఏర్పాటు చేసి గత నాలుగేండ్లుగా ఏటా 150 మంది చొప్పున 600 మంది వైద్య విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ల్యాప్రోసోపిక్, తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్‌ను ఏర్పాటు చేశారు.
మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం అందిచాలనే లక్ష్యంతో వారంలో ఒకరోజు మహిళలకు వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రతి మంగళవారం ‘ఆరోగ్య మహిళ’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఒకటి చొప్పున పీహెచ్‌సీలను ఏర్పాటు చేసి ఉచితంగా ఎనిమిది రకాల పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, ఇతర సాధారణ పరీక్షలు, ఓరల్ సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ పరీక్షలు, థైరాయిడ్, సూక్ష్మ పోషకాహార లోపాలు, అయోడిన్ సమస్యలు తదితర పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 5,690 మందికి పరీక్షలు చేశారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానతోపాటు నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ ఏరియా ఆస్రత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిల్లో ప్రతిరోజూ 40 నుంచి 50 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలు అందుతున్నాయి. సాధారణంగా డయాలసిస్ చేయించాలంటే కార్పొరేట్ ఆస్పత్రిలో రూ.3 నుంచి 5 వేల వరకు ఖర్చవుతుంది. కొందరికి వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయాల్సి ఉంటుండగా, మరికొందరికి నెలలో ఒకటి లేదా రెండుసార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. దాంతో ఒక రోగికి ప్రతినెలా సుమారు రూ.12 వేల నుంచి 40 వేల వరకు ఆర్థిక భారం పడనున్నది. నిరుపేదలు ఈ భారం భరించలేక ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే రాష్ట్ర సర్కారు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆపన్నహస్తం అందిస్తున్నది. అంతేకాక గతంలో ఒక డయాలసిస్ కిట్(డయలైజర్)ను అనేకసార్లు వినియోగించేవారు. దాంతో ఇన్ఫెక్షన్ వచ్చి అనారోగ్యానికి గురయ్యేది. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా డీమేడ్ సెంటర్లు ఏర్పాటు చేసి సింగిల్ యూజ్డ్ డయలైజర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానంతో ఒక డయలైజర్‌ను ఒకేసారి వినియోగిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం సాధారణ ప్రసవాలపై దృష్టి సారించింది. అన్ని ఆస్పత్రులను బలోపేతం చేయడంతోపాటు 18 పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేసి 24 గంటలపాటు వైద్యులను అందుబాటులో సేవలు అందిస్తున్నది. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగి మాతాశిశు మరణాలు తగ్గాయి. షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు నెలకు సరిపడా ఎన్సీడీ కిట్లు అందిస్తున్నారు. దీర్ఘకాలిక రోగాలైన క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ వ్యాధిగ్రస్తులకు కూడా ఇంటింటికి వెళ్లి మందులు అందిస్తున్నారు. వీటన్నింటి కారణంగా మనిషి జీవిత కాలం 60 నుంచి 65 ఏండ్లకు పెరిగింది.
గతంలో ప్రజలకు సుస్తీ చేస్తే ప్రైవేట్ దవాఖానలే దిక్కయ్యేవి. ప్రభుత్వ వైద్యసేవలు అందుబాటులో ఉండేవి కావు. ఇప్పుడు పట్టణాల్లో సకల సౌలత్‌లతో బస్తీ దవాఖానలు, పల్లెల్లో పల్లె దవాఖానలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 5 వేల జనాభా కలిగిన 195 సబ్సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చడంతోపాటు నూతనంగా 7 పీహెచ్‌సీలు, 5 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారు.
ప్రాణాంతర మైన మహమ్మరి క్యాన్సర్ బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారని గ్రహించిన సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా కేంద్రంలో పాలియేటివ్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేయించారు. ఎన్సీడీ కార్యక్రమంలో భాగంగా 20 పడకలతో అన్ని రకాల వసతులతో యూనిట్‌ను ఏర్పాటు చేసి జిల్లాలో 182 మంది ఇన్‌పేషెంట్లకు, 245 ఔట్ పేషేంట్లకు చికిత్స అందిస్తున్నారు.