– బీఎల్ఓలకు నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సూచన
గట్టుప్పల్, జూలై 01 : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలలో వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ బీఎల్ఓలను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ గట్టుప్పల్ మండల కేంద్రంతో పాటు వెల్మకన్నె గ్రామంలో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలు ఓటర్లకు ఇవ్వడం, వాటిలో వివరాల నమోదును తనిఖీ చేశారు. 2002లో ఓటరు వివరాలున్నట్లయితే ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫారంలో ఎలాంటి వివరాలు నమోదు చేస్తున్నారు? లేనట్లయితే ఎలాంటి వివరాలు పొందుపరచాలో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక కుటుంబం మొత్తం ఒక పోలింగ్ కేంద్రంలోకి వచ్చేలా చూడాలని, బీఎల్వోలు ఇల్లిల్లు సందర్శించే సమయంలోనే ఫామ్ -6, 8 వెంట బెట్టుకుని వెళ్లాలని చెప్పారు. ఒక ఓటరుకు రెండుచోట్ల ఓటు నమోదు ఉన్నట్లయితే ప్రస్తుతం తనకు ఓటు ఎక్కడ ఉండాలో ఓటరే నిర్ణయించుకోవాలని, లేనట్లయితే అధికారులే రికార్డుల ఆధారంగా ఒక చోట తొలగించవచ్చని స్పష్టం చేశారు.
ఎవరికీ రెండు చోట్ల ఓటు హక్కు ఉండరాదన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో బిఎల్ఓ లకు సహకారం అందించాలని, ఈ విషయమై పంచాయతీ కార్యదర్శులు బీఎల్వోలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేసి తెలియజేయాలని ఎంపిడిఓ హిమబిందును ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపిన తర్వాత ఓటరు జాబితా ప్రదర్శన, కొత్త ఓటు నమోదు, తప్పులను సరి చేయడం వంటివి చేపట్టడం జరుగుతుందని, అందువల్ల ఓటర్లు త్వరితగతిన వారి వివరాలను సమర్పించి ఎన్యుమరేషన్ ఫామ్స్ ప్రక్రియను పూర్తి చేసేలా సహకరించాలని కోరారు. అనంతరం బిఎల్ఏలు అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని తాసీల్దార్ రాములును కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట చండూర్ ఆర్డీవో శ్రీదేవి, తాసీల్దార్ రాములు, ఎంపీడీఓ హిమబిందు ఉన్నారు.