పెద్దవూర, జూన్ 4: భూభారతి చట్టం అమల్లో భాగంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె మండలంలోని వెల్మగూడెం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు హాజరై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, రైతులతో మాట్లాడి వారి సందేహాలు నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సదస్సుల్లో సాదాబైనామాలు, పెండింగ్ మ్యుటేషన్లు, సక్సేషన్స్ విస్తీర్ణంలో తప్పుల సవరణ, భాగ పంపిణీ, శివాయ్ జమేదార్, పట్టాపాస్‌బుక్‌లో తప్పుల సవరణ తదితర అన్ని రకాల సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. సదస్సులు నిర్వహించే విషయాలు రెవెన్యూ అధికారులు ముందుగానే ఆయా గ్రామాల్లో చాటింపు వేయించి ప్రజలందరికీ తెలియచేయాలన్నారు. వెల్మగూడెంలో 70 దరఖాస్తులు వచ్చాయన్నారు. పాస్‌బుక్‌లో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చని తెలిపారు.
లావుని పట్టా భూములు పట్టా చేయడం కుదరదని, అదేవిధంగా ప్రభుత్వ భూములు కొన్న వారికి రెగ్యులరైజేషన్ చేయడం జరగదని, కలెక్టర్ పరిధిలో ఉన్న వాటిని మాత్రమే సదస్సులో పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇనాం భూముల ఓఆర్డీసీ డాక్యుమెంట్లు లేని భూములు గురించి తెలిపారు.
రైతులు తప్పనిసరిగా భూమికి సంబంధించిన కాగితాలు కలిగి ఉంటే సులభంగా పట్టా అవుతుందని, పట్టాలు పొందడం వల్ల రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే లాభాలన్నింటిని పొందవచ్చని, ప్రత్యేకించి రైతుబంధు, రైతుబీమా, బ్యాంకు రుణాలు వంటివి తీసుకోవచ్చని తెలిపారు. రైతులు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఆర్ఐ శ్రీనివాస్‌రెడ్డి, హబీబ్అలీ తదితరులు ఉన్నారు.