సూర్యాపేట టౌన్, మే 25 : సూర్యాపేట మండలం ఎర్కారంలో మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధు(42) హత్య ప్రతీకారంతోనే చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. సోమవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ప్రమేయమున్న ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. వారు హత్యకు వినియోగించిన కత్తి, సెల్ఫోన్లు, కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో నిందితురాలు పరారీలో ఉ న్నట్లు తెలిపారు. శనివారం సూర్యాపేట రూరల్ ప రిధిలోని ఎర్కారం గ్రామ శివారులో కల్వర్టు కింద లభించిన మృతదేహం కేసుపై ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. నిందితులు ఎర్కారం గ్రామానికి చెందిన మిద్దే జీవన్, రామన్న గూడానికి చెందిన చింత సైదులు, మేదరి ప్రసాద్, ఎర్కారం గ్రామానికి చెందిన మిద్దే ఆనంద్, సూర్యాపేట తాళ్లగడ్డకు చెందిన కక్కిరేణి భరత్ చంద్‌లను అరెస్టు చేసినట్టు తెలిపారు. మరో నిందితురాలు ముల్కలపల్లి భవానీ పరారీలో ఉన్నట్లు తెలిపారు. మధు శుక్రవారం ఉదయం 11 గంటలకు సూర్యాపేట కుడకుడ రోడ్డులో అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి వెళ్లి రాత్రి వరకు రాకపోవడంతో అతడి భార్య మౌనిక అదే రోజు రాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించామన్నారు.
ఎర్కారం గ్రామ శివారులో కల్వర్టు కింద గోనె సంచిలో మృతదేహాన్ని గుర్తించామన్నారు. అనంతరం హత్య కేసుగా మార్చి ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టామన్నారు. సూర్యాపేటలోని తాళ్లగడ్డలో చింతల సైదులు నివాసముంటున్న కిరాయి ఇంటిని గుర్తించి.. హత్య జరిగిన ఇంటి వద్ద క్లూస్‌టీం అధికారులు ఆధారాలను సేకరించారని చెప్పారు. సంఘటన జరిగిన 24 గంటల్లోనే హత్యకు పాల్పడిన నిందితులను గుర్తించామన్నారు. పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. 2007లో ఎర్కారం గ్రామ సర్పంచ్ మిద్దే రవీందర్‌ను హత్య చేసిన కేసులో చింతలపాటి మధు(42 )ప్రధాన నిందితుడని, తన తండ్రి మిద్దే రవీందర్ హత్యకు గురయినప్పుడు ఎనిమిదేండ్ల వయస్సులో ఉన్న మిద్దే జీవన్ ప్రతీకారం పెంచుకొని ఈ హత్యకు పథకం పన్నారని చెప్పా రు. ఆ దిశగా కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో టేకుమట్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఖమ్మం హైవే టీ జంక్షన్ వద్ద సోమవారం ఉదయం 6 గంటలకు ప్రధాన నిందితుడు మిద్దే జీవన్, మిద్దే ఆనంద్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేశామన్నారు. తన తండ్రిని హత్య చేసినందుకు ప్రతీకారంతో మధును స్నేహితుల సహకారంతో అంతమొందించామని అంగీకరించారని వివరించారు.
మధు బతికి ఉంటే తనకు ప్రాణహాని ఉంటుందని భావించి ఎలాగైనా చంపాలని పథకం ప్రకారం హత్య చేశామని జీవన్ తెలిపాడని చెప్పారు. ఈ హత్యకు సూర్యాపేట రూరల్ మండలం రామన్నగూడానికి చెందిన చింత సైదులు, మేదిరి ప్రసాద్ సహకరించినట్లు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రసాద్, సైదులు దావత్ చేసుకుందామని మధును పిలిపించుకున్నారని, పదునైన కత్తితో మధుపై సైదులు దాడి చేశాడని, మధు మెడ, భుజంపై జీవన్ దాడి చేసి హత్య చేశారని చెప్పారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి ఎర్కారం గ్రామ శివారులోని కల్వర్టు కింద పడేశారన్నారు. మధు బైక్‌ను బాలెంల శివారులో పడేశారని చెప్పారు. ప్రసాద్, సైదులు బైక్‌పై వెళ్లి కత్తిని, మధు ఫోన్‌ను ఆడివెంల శివారులోని కాల్వలో పడేశారని చెప్పారు. మధును గతంలోనే చంపేందుకు రెండుసార్లు విఫల ప్రయత్నం చేసినట్లు ఎస్పీ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకొని వారు చెప్పిన వివరాల ఆధారంగా మిగిలిన నిందితులను సోమవారం ఈనాడు ఆఫీసు సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక బైక్, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకొని అన్ని కోణాల్లో దర్యాపు చేసి హంతకులకు శిక్షపడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, వెంకటయ్య, రాజశేఖర్, శివకుమార్, రామారావు, ఏడుకొండలు, శివతేజ, మహేందర్నాథ్, బాలునాయక్ ఉన్నారు.