హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ ప్రధానకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాపై తెలంగాణ హైకోర్టు అరెస్టు వారంట్ జారీచేసింది. గత నెలలోనే వారంట్ జారీ అయినప్పటికీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ఉన్నత న్యాయస్థానం ఇటీవలే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశించింది. అదే క్రమంలో కోర్టు ఆదేశాలను అమలుచేయడంలో విఫలమైన ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్ సుల్తానియాపై బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీచేసింది. ఆయన ఎకడ ఉన్నా అరెస్టు చేసి ఆగస్టు 7న ఉదయం 10.30 గంటలకు కోర్టు ఎదుట హాజరుపరచాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.
జస్టిస్ నగేశ్ భీమపాక జూలై 10న ఈ ఉత్తర్వులు జారీచేశారు. కోర్టు ఆదేశాల మేరకు సుల్తానియా రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి, శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కోర్టుకు హాజరవుతానని లిఖితపూర్వక హామీ ఇస్తే బెయిల్‌పై విడుదల చేయవచ్చని కూడా న్యాయస్థానం స్పష్టంచేసింది. అనంతరం కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విచారణకు హాజరవుతూ ఉండాలని పేరొన్నది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ నేత జే రామకృష్ణ దాఖలు చేసిన కోర్టు ధికార పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. 2024లో రామకృష్ణ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, కంటోన్మెంట్ బోర్డు నుంచి వసూలు చేసిన సర్‌చార్జ్ ఆన్ స్టాంప్‌డ్యూటీ బకాయిలు రూ.33.12 కోట్లు విడుదల చేయాలన్న ఆయన వినతిని పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఆ ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపిస్తూ రామకృష్ణ 2026 మార్చిలో కోర్టు ధికార పిటిషన్ దాఖలు చేశారు.
ధికార కేసు విచారణలో కోర్టు తొలుత సుల్తానియాకు నోటీసులు జారీ చేసి.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయకపోతే వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టంచేసిం ది. అయితే సుల్తానియా కౌంటర్ దాఖలు చేయకపోగా.. ఆయన తరఫున ఎవరూ కోర్టుకు కూడా హాజరు కాలేదు. దీనిని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. దీంతో సుల్తానియా వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు జారీచేసింది. జూలై 10న కేసు మరోసారి విచారణకు రాగా, ప్రభుత్వం తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలుకు మరింత సమయం కోరారు. అయితే ఇప్పటికే తగిన అవకాశాలు ఇచ్చినా కౌంటర్ దాఖలు చేయలేదని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఎలాంటి పిటిషన్ కూడా దాఖలు కాలేదని కోర్టు పేరొంది. అదనపు గడువు ఇవ్వడానికి నిరాకరిస్తూ సుల్తానియాపై బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేసింది. అలాగే వారంట్‌ను వీలైనంత త్వరగా అమలు చేసి, ఆగస్టు ఏడు లోపు అమలు చేసిన విధానం లేదా అమలు చేయలేకపోయిన కారణాలను వివరిస్తూ సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.