సూర్యాపేట, ఆగస్టు 16 : ఏపీ ప్రభుత్వం నిర్మించబోయే బనకచర్ల ప్రాజెక్ట్ కోసమే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదంటున్నడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు, రేవంత్‌ల బనకచర్ల వ్యాఖ్యలపై శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. నిన్న రేవంత్ మాట్లాడిన తీరు చంద్రబాబు ప్రసంగానికి కొనసాగింపే అన్నారు. గోదావరిలో నీళ్లు లేవని చెప్పకుండా కాళేశ్వరం లేదని చెప్పడం అంటే కేవలం బనకచర్లకు మద్దతు ప్రకటించడమే అన్నారు. కాళేశ్వరం నుంచి 240 టీఎంసీలకు పైగా నీళ్లను వాడుతున్నామని చెప్పాల్సింది. ఇది చెప్పలేదంటే బనకచర్లకు అనుమతిస్తున్నట్లే అని స్పష్టమవుతుందన్నారు. బనకచర్ల కట్టి తీరుతామన్న చంద్రబాబుకు అనుకూలంగానే కాళేశ్వరంలో మాకు నీళ్లు అవసరం లేదు అన్నట్లు ఉందన్నారు. ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రజలకు మోసం చేయడానికే అన్నారు.
వాస్తవంగా గోదావరిలో మిగులు నీళ్లు లేవు. పక్క రాష్ట్రంలో కట్టే ప్రాజెక్టును వ్యతిరేకించాలి. కానీ రేవంత్ మాత్రం చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ని ఇక్కడ చదివి వినిపించినట్లు తెలిపారు. బనకచర్లకు అనుమతులు రావాలంటే కాళేశ్వరంను రికార్డులో నుంచి మాయం చేయాలనే కుట్ర అని దుయ్యబట్టారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంపై ఉన్న నంది మేడారం, కన్నేపల్లి గాయత్రి పంప్ హౌస్‌లను ప్రారంభించారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా బాగున్నట్లేగా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా గత ఎనిమిది పంటలకు నీళ్లు ఇచ్చినట్లుగానే ఈ ప్రభుత్వం ఆయకట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి దేవాదుల నుంచి నీళ్లు ఇస్తామంటూ కొత్త పాట అందుకున్నట్లు తెలిపారు. దేవాదుల నీళ్లు ఇస్తామన్న ప్రాంతానికే ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎస్సారెస్పీ 40 ఏండ్లు గడిచినా మొత్తం ఆయకట్టుకు ఇప్పటివరకు నీళ్లు ఇవ్వలేదు. దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు తెస్తామనేది ఒక మోసం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని కన్నేపల్లి పంపు హౌస్‌ను ప్రారంభించి ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇవ్వాలన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చెప్పిందంతా అబద్దం అని రుజువైందన్నారు. వర్షపు నీళ్లతో రైతాంగం పంటలు వేసుకుంటున్నట్లు తెలిపారు. కొద్ది రోజులైతే నీళ్లు లేక మళ్లీ పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తదన్నారు. నందిమేడారం పంపు ఆన్ చేస్తే మిడ్ మానేరుకు నీళ్లొచినయ్. అట్లనే మిగతా పంపులు ఆన్ చేస్తే సూర్యాపేటకు కూడా నీళ్లు వస్తాయని తెలిపారు. వారు ప్రారంభించిన పంప్ హౌస్ లన్ని కాళేశ్వరంలో భాగమే అన్నారు.
నాలుగేళ్లుగా సూర్యాపేటకు వచ్చింది కాళేశ్వరం జలాలే అన్నారు. ఇప్పుడొచ్చే నీళ్లకు ఏ పేరు పెట్టినా పర్వాలేదు కానీ ఒక ఎకరం ఎండిపోకుండా నీళ్లు ఇవ్వాలన్నారు. చంద్రబాబు తానా అంటే రేవంత్ తందనాలు ఆడుతున్నాడన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బనకచర్లను వ్యతిరేకించి తీరాలన్నారు. గోదావరిపై ఇంకో ట్రిబ్యునల్ వచ్చినా తర్వాతనే ఏపీ ప్రాజెక్టులకు అనుమతించాలి. ఎట్టి పరిస్థితిలో ఇప్పుడున్న నీళ్ల మీద ప్రాజెక్ట్ కట్టడానికి వీలు లేదు. గోదావరిలో మనకిచ్చిన హక్కుల ప్రకారమే మనం కాళేశ్వరం నీళ్లు వాడుతున్నాం. ఈ విషయాన్ని మాట్లాడకుండా రేవంత్ దాచి పెట్టడం, కేసీఆర్‌ని విమర్శించడం సరికాదన్నారు. చంద్రబాబుకు వంత పాడుతున్న రేవంత్ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తుండన్నారు. వ్యవసాయ మోటార్లకు బీఆర్ఎస్ ఇచ్చిన పద్ధతుల్లోనే నిరంతరం విద్యుత్ అందించాలన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌తో పాటు సరిపడా నీళ్లందించాలి డిమాండ్ చేశారు.