మునుగోడు, ఏప్రిల్ 02 : పెట్టుబడిదారులకు రేవంత్రెడ్డి సర్కార్ కొమ్ముకాస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని కట్టబెట్టాలని చూస్తుందని, ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. మునుగోడు మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో బుధవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆస్తికి ప్రభుత్వం రక్షణగా ఉండాల్సిందిపోయి రియల్ ఎస్టేట్ సంస్థలాగా మారి వేలం వేస్తే ఇక భవిష్యత్ తరాల ఉనికి ఏంటని ఆయన ప్రశ్నించారు.
భూముల వేలం వల్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు వ్యక్తిగతంగా లాభం కలుగుతుందే తప్పా ప్రజలకు ఎలాంటి మేలు జరుగదన్నారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూముల వేలాన్ని ఉపసంహరించుకోకపోతే దశలవారీగా పోరాటాలు ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, నాయకులు వెంకటేశ్, కట్ట వెంకన్న, నితిన్, బొందు శివ, అనిల్ పాల్గొన్నారు.