మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 5 : రాష్ట్రంలో విద్యావ్యవస్థను రేవంత్ సర్కార్ భ్రష్టు పట్టిస్తుస్తోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకేశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు నల్లమోతు సిద్ధార్థతో కలిసి పట్టణంలోని గురుకులాలు, గ్రంథాలయంలోని నిరుద్యోగ యువతతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ..విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ల విడుదల, కోచింగ్ సదుపాయాలు, గ్రంథాలయాల్లో కల్పిసస్తున్న మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు.
నిరుద్యోగ యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నిరంతరం పాటు పడతానని, పట్టభద్రుల గొంతుకగా శాసన మండలిలో నిలుస్తానని హామీ ఇచ్చారు. దేశంలోనే విద్యాశాఖ మం త్రిలేని రాష్ట్రం ఏదైనా ఉంటే అది మన రాష్ట్రమేనన్నారు. అన్ని రాష్ర్టాలు 15శాతం కంటే ఎక్కువ నిధులను విద్యాశాఖకు కేటాయిస్తే, మన రాష్ట్రంలో మాత్రం 8శాతం నిధులు కేటాయించి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారన్నారు. స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంటు రాక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేశామని, ఇప్పుడేదో కొత్తగా అమలు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గప్పాలు కొట్టుకుంటోందన్నారు. కేసీఆర్ దళిత, గిరిజన, మైనార్టీల కోసం గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య, మూడు పూటలా భోజనం అందించి భవిష్యత్తు తరాల కోసం ఆలోచన చేస్తే వాటిని భ్రష్టు పట్టిస్తున్నారని, గురుకులాల్లో మంచి భోజనం అందక ప్రతి రోజూ ఏదో ఒక చోట విద్యార్థులు దవాఖానల పాలవుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పాఠశాలలకు చాక్ పీసులు కూడా సరఫరా చేయలేని అసమర్థ సర్కార్ ఇది అంటూ విమర్శించారు. 33 జిల్లాల్లో 4 జిల్లాలను తప్పిస్తే డీఈవోలు, డిప్యూటీ డీఈవో, ఎంఈవోలను కూడా నియమించలేని దౌర్భాగ్య స్థితిలో విద్యావ్యవస్థ ఉందని రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు.
ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు పెంచకుండా తాత్సారం చేస్తున్నారని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 3 నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సీపీఎస్ విధానం రద్దు చేసి, ఓపీఎస్ విధానం తెస్తామని మేనిఫెస్టోలో పెట్టి, అధికారంలోకి రాగానే దాని ఊసే పట్టించుకోలేదని అన్నారు. 317 జీవో రద్దు చేయాలని, లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండీ ఇలియాస్, పెద్ది శ్రీనివాస్, ఎండీ మగ్ధుం, ధనావత్ చిట్టిబాబు నాయక్, గంగుల భిక్షం యాదవ్, యర్రమళ్ల దినేశ్, ఎండీ షోయబ్, చీదెళ్ల వెంకటేశ్వర్లు, పునాటి లక్ష్మీ నారాయణ, భూక్యా రాంబాబు, మణిదీప్, వినోద్, గయాస్, గంట శ్రవణ్‌రెడ్డి, రఫీ, వీరా నాయక్, శివ నాయక్, రమావత్ వినోద్ నాయక్, షేక్ మస్తాన్, అలీం, దోనేటి సైదులు, తుమ్మల ఫణికుమార్, వినోద్ కుమార్, లింగరాజు, అభిలాశ్, వినయ్, నాగయ్య, చిన్న నాయక్‌తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.