‘సాంకేతిక నైపుణ్యం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మొన్న జరిగిన శాసనసభలో కొత్త శాసనం చేసినం.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఫోర్త్ సిటీలో నిర్మించాలని 60 ఎకరాల స్థలాన్ని కేటాయించినం.. దాదాపు 200- 300 కోట్లతో నిధులతో పనులు ప్రారంభించాం. వచ్చే సంవత్సరం నుంచి అక్కడ కళాశాల ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఐఐహెచ్‌టీకి గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.’ ఇవీ హైదరాబాద్‌లో సోమవారం జరిగిన చేనేత సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలు.
భూదాన్ పోచంపల్లి నేతన్నల ఆశలు, ఆకాంక్షలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. భూదాన్ పోచంపల్లి మాత్రమే కాదు.. యాదాద్రి భువనగిరి జిల్లా నేత కార్మికుల నోట్లో మట్టి కొట్టింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని తరలించుకుపోయింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేసింది. వచ్చే ఏడాది నుంచి స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో భూదాన్ పోచంపల్లిలో ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు ఫుల్స్టాప్ పడింది. ఎన్నో ఏండ్ల పోరాటాలు, ఆందోళనలు, వినతిపత్రాలతో సాధించుకున్న సంస్థను గద్దలా ఎగరేసుకుని పోయారు.
రాష్ట్రంలో నలభై వేల చేనేత కుటుంబాలు ఉండగా, అత్యధికంగా భూదాన్ పోచంపల్లిలోనే నేత కార్మికులు ఉన్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయ పద్ధతులను నమ్ముకొని మగ్గాలపై చీరలు, చేనేత వస్త్రాలు ఉత్పత్తి చేస్తున్నారు. పెద్ద ఎత్తున వస్త్ర వ్యాపారం, తయారీ రంగం ఉంది. ప్రస్తుతం ఐఐహెచ్‌టీల్లో కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. తెలంగాణలో ఐఐహెచ్‌టీ లేకపోవడంతో ఇతర రాష్ర్టాలకు తరలివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది ఆర్థికంగా ఇబ్బంది కావడంతోపాటు, దూరభారం అవుతున్నది. ఇటీవల రాష్ర్టానికి కేంద్రం ఐఐహెచ్‌టీని మంజూరు చేసింది. అయితే రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై చర్చకు వచ్చినప్పుడు పోచంపల్లి లేదా గద్వాల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అంతిమంగా భూదాన్పోచంపల్లిలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 2న చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్ జీఓ నంబర్ 11 విడుదల చేశారు. దీంతో ఇక్కడి నేతన్నల కల సాకారమైందని, ఎన్నో ఏండ్లుగా నేత కార్మికుల చేస్తున్న ఆందోళనలు, విజ్ఞప్తులకు సార్థకత లభించిందని ఎంతో సంబురపడ్డారు.
కనుముక్కలలో అందుబాటులో విశాల భవనాలు..
భూదాన్ పోచంపల్లిలో ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. ఇప్పటికే పోచంపల్లి చేనేతకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కత్ వస్ర్తాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఇక మండలంలోని కనుముక్కల పరిధిలో ఉన్న హ్యాండ్లూమ్ పార్క్‌లో భవనాలు అందుబాటులో ఉన్నాయి. ఇది 26 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని గతేడాది రాష్ట్ర ప్రభుత్వం 12.5 కోట్లతో కొనుగోలు చేసింది. ప్రస్తుతం పారులోని విశాలమైన భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని మరమ్మతులు చేపడితే బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు. అంతే కాకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లా కేంద్రాలకు పోచంపల్లి దగ్గరలో ఉంటుంది. మన దగ్గరే ఐఐహెచ్‌టీ ఏర్పాటైతే చేనేత, జౌళి, డిప్లొమా డిగ్రీ పీజీ కోర్సులతోపాటు పరిశోధనలు, అభివృద్ధి అధ్యయనాలు జరుగుతాయి.
ఎన్నో ఏండ్లుగా నేతన్నల పోరాటం..
పోచంపల్లిలో ఐఐహెచ్‌టీ కోసం ఎన్నో ఏండ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి. పద్మశాలి, నేత కార్మిక సంఘాలు సైతం దీనిపై అనేక విజ్ఞాపనలు చేశాయి. రాష్ట్ర మంత్రులు, కేంద్రానికి వినతులు అందించాయి. ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశాయి. ఐఐహెచ్‌టీకి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో కూడా నెలకొల్పాలని మాజీ మంత్రి కేటీఆర్ అనేక విధాలుగా తన వంతు ప్రయత్నాలు చేశారు. అనేక సార్లు కేంద్ర మంత్రులకు స్వయంగా లేఖలు రాశారు. కానీ పోచంపల్లికి ఐఐహెచ్‌టీ వచ్చినట్లే వచ్చి.. అటే వెళ్లిపోయింది.
స్కిల్ యూనివర్సిటీకి తరలింపు..!
పోచంపల్లికి ఐఐహెచ్‌టీ మంజూరు కావడంతో ఇక్కడే ప్రారంభించాలి. కానీ సమయాభావం, అత్యవసరం అంటూ తాత్కాలికంగా హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేశారు. జీఓలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. కనుముక్కలలో ఏర్పాటుకు కేంద్రం అప్రూవల్ ఇచ్చిందని అందులో చెప్పుకొచ్చారు. దీంతో మొదటి విద్యా సంవత్సరం కోసం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ క్యాంపస్ నుంచే ప్రక్రియ కొనసాగించారు. ఏడాది, రెండేండ్ల తర్వాత పోచంపల్లికి వస్తుందని అంతా భావించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం బాంబ్ పేల్చే వార్తను చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఫోర్త్ సిటీలోని స్కిల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తామని కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టం చేశారు. అధికారులు సైతం పోచంపల్లిలోనే ఉండాలని రేవంత్ రెడ్డికి సూచించగా, ఆయన ససేమిరా అన్నట్లు తెలిసింది. అయితే దీన్ని కొడంగల్‌కు తరలించే కుట్ర జరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఐఐహెచ్‌టీ తరలింపుపై నేత కార్మికులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్నారు. పోచంపల్లిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.