నల్లగొండ, అక్టోబర్ 27: నల్లగొండ జిల్లాలోని పులిచర్ల జడ్పీహెచ్ఎస్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన చిలువేరు సత్యనారాయణ గతేడాది అక్టోబర్ 24న ఉద్యోగ విరమణ చేశారు. తన ఇద్దరి కూతుర్లలో ఒక కూతురి పెండ్లి చేసిన ఆయన.. మరో కూతురి వివాహం రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో చేయవచ్చని అనుకున్నారు. అయితే ఆరు నెలలై నా ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వకపోవటంతో అటు కూతురు పెండ్లి చేయలేక..ఇటు కట్టాల్సిన ఈఎమ్ఐలు చెల్లించలేక ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఇప్పటికీ ఆయన జాడ లేదని, కుటుంబ సభ్యులు, సహచరుల ఆవేదన.
యాదాద్రి భువనగిరికి చెందిన దేవానంద్ అనే సబ్‌రిజిస్ట్రార్ ఆగస్టులో ఉద్యోగ విరమణ చేశారు. తనకు వచ్చే లక్షన్నర జీతంలో రూ.60వేలు మాత్రమే పెన్షన్‌గా రావటంతో ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఆయన రెండు రోజుల క్రితమే కాలం చేశాడు. ఇది ఒకరిద్దరు రిటైర్డ్ ఉద్యోగుల సమస్య కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలో ఉమ్మడి జిల్లాలో సుమారు 1600 మంది ఉద్యోగ విరమణ చేయగా వారికి ఇప్పటి వరకు రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వకపోవటంతో 63 ఏం డ్ల వయసులో ఏం చేయలో..ఎవరికి చెప్పుకోవాలో తెలియక రోడ్డెక్కుతున్నారు. తాజాగా మరోసారి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు వచ్చి తమకు బెనిఫిట్స్ ఇవ్వాలంటూ ధర్నా చేసి అదనపు కలెక్టర్ వినతి పత్రం అందచేశారు.
ఒక్కో వ్యక్తికి సగటున రూ.60 లక్షలు..
ఉద్యోగ విరమణ చేసిన ప్రతి ఉద్యోగికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద సగటున రూ.60 లక్షలు రావాల్సి ఉంటుంది. గ్రాట్యుటీతో పాటు కమ్యుటేషన్, జీపీఎఫ్, జీఐఎస్, టీఎస్జీఎల్ఐ, లీవ్ ఎన్క్యాష్మెంట్తోపాటు 2020లో రావాల్సిన పీఆర్సీ 12 వాయిదాల్లో ఇస్తామని చెప్పిన సర్కార్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, ఉద్యోగ విరమణ చేశాక ఇస్తామని చెప్పి, అది కూడా పెండింగ్‌లో పెట్టడం తో రిటైరైన ఉద్యోగుల పరిస్థితి ఆగ మ్య గోచరంగా మారింది. అయితే జిల్లాలో మొత్తం సమారు1600 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉండగా వారిలో ఇప్పటికే 17 మంది చనిపోయారు. అయితే వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం గమనార్హం.
19 నెలలుగా బెనిఫిట్స్ కోసం ఎదురుచూపులు..
పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు 61 ఏండ్ల తర్వాత ఉద్యోగ విరమణ చేశారు. ఉమ్మడి జిల్లాలో 2024 మార్చి తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారే 1600 మంది ఉన్నారు. వీరు ఆయా శాఖల్లో సేవలందించి రిటైర్ కాగా వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ మాత్రం అందకపోవటంతో ప్రతిరోజూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు పెన్షన్ మాత్రమే ఇచ్చి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవటంతో రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తమ పిల్లల పెండ్లిళ్లు, పేరంటాలతోపాటు ఇల్లు, కారు, ఇతర ఈఎంఐలు కట్టలేక అప్పు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష రూపాయల జీతం వచ్చే వారికి రూ.40వేల పెన్షన్ మాత్ర మే వస్తోందే తప్ప రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఎలా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవడం సరికాదు..
30 ఏండ్లకు పైగా వివిధ ప్రభుత్వ శాఖ ల్లో సేవలందించి రిటైర్డ్ ఉద్యోగులు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఆపటం ఎంతవరకు సమంజ సం. 19 నెలలుగా ఇవ్వకుండా జాప్యం చేయటంతో వృద్ధాప్యం లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాం. కట్టాల్సిన ఈఎంఐలు ఆగిపోయి అప్పులోళ్లు ఇండ్లకు వస్తే ఏం చేయాలో తెల్వట్లేదు. ప్రభుత్వం వెంటనే మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలి.
– భిక్షపతి, రిటైర్ట్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, నల్లగొండ
వృద్ధాప్యంలో అప్పుల బాధ ఎక్కువైంది..
నాకు ఇప్పుడు 63 ఏండ్లు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇంటితోపాటు కారు లోన్ తీసుకున్నా. ఇప్పటికీ లోన్లు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నా. 35 ఏండ్లు సర్వీ సు చేయించుకున్న ప్రభుత్వం ఈ రోజు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆపడమేంది. ఒక్కొక్కరికీ కనీసం రూ.60 లక్షల దాక వస్తాయి. కొంతమంది పిల్లల పెండ్లి చేయలేక, డబ్బులు అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అర్థం చేసుకొని మా బెనిఫిట్స్ మాకు ఇవ్వాలి. లేకుంటే తగిన బుద్ధి చెప్తాం.
– కాటబత్తుల గణేశ్, రిటైర్డ్ ఉద్యోగి, నల్లగొండ