సూర్యాపేట, డిసెంబర్ 24: రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బకాయిలు చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం టీఎస్‌జీఆర్‌ఈఏ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందజేయకపోవడంతో కుటుంబాలు ఇబ్బందుల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం పోరాడిన వారిలో కొందరు మృతి చెందారన్నారు. ప్రభుత్వం స్పందించి రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే బకాయిలు చెల్లించాలన్నారు.
రిటైర్డ్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కార్డులు, డీపీఎఫ్, గ్రాట్యుటీ ఇవ్వాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం వేరే అవసరాలకు మళ్లించడం సరికాదని, బకాయిలు చెల్లించని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీక్షకు డీటీఎఫ్, టీఎస్‌యూటీఎఫ్, టప్రా సంఘాలు మద్దతు తెలిపాయి. కార్యక్రమంలో పొనుగోటి కోటయ్య, దశరథ రామారావు, బొల్లు రాంబాబు, బి.సోమయ్య, మల్లు వెంకటరాంరెడ్డి, ముప్పాని కృష్ణారెడ్డి, మన్నె యాదగిరి, కేతిరెడ్డి రంగారెడ్డి, అబ్దుల్లా, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్, లింగయ్య, ఉపేందర్, కరుణ, సంధ్యారాణి, రేణుక తదితరులు పాల్గొన్నారు.
రామగిరి, డిసెంబర్ 24: పెన్షనర్ల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పెన్షనర్ల సంఘం నాయకులు కొంపల్లి భిక్షపతి మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామన్నారు. దీక్షలకు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్టీఎఫ్) జిల్లా అధ్యక్షుడు నిమ్మనగోటి జనార్దన్ మద్దతుగా మాట్లాడారు. పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు భాస్కర్, రాజశేఖర్ తదితరులు మద్దతు తెలిపారు. దీక్షలో పెన్షనర్ల సంఘం నాయకులు కొంపల్లి భిక్షపతి, రామకృష్ణారెడ్డి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.