రామగిరి, డిసెంబర్ 21 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిశోధన అంశాల్లో ముందుకు సాగుతున్నది. ఐసీఎస్ఎస్ఆర్ సౌజన్యంతోఈ నెల 12న ప్రారంభించిన రీసెర్చ్ మెథాడాలజీ కోర్సు శిక్షణ శనివారం ముగిసింది. ఎంజీయూ ఏర్పాటు తర్వాత రెనిడెన్షియల్ విధానంలో తొలిసారి నిర్వహించిన శిక్షణకు దేశంలో వివిధ రాష్ర్టాల యూనివర్సిటీల నుంచి 38 మంది అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు హాజరయ్యారు.
మొత్తం 32 సెషన్లలో నిపుణులైన అధ్యాపకులు 17 మంది ప్రొఫెసర్లు సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్ఐటీ, ఐపీఈఎస్ వంటి పేరుగాంచి సంస్థల నుంచి హాజరై శిక్షణ ఇచ్చారు. ప్రధానంగా పరిశోధనల్లో గుణాత్మక విధానం, రీసెర్చ్ ప్రపోజల్స్ తయారీ, అకడమిక్ రైటింగ్, పరిశోధన పత్రాల ప్రచురణ, ఆధునాతన సాంకేతిక పద్ధతులు, కేర్ జర్నల్స్‌లో ఆర్టికల్ రాసే విధానం, రీసెర్చ్‌కు అవసరమైన 70పైగా టూల్స్(సూత్రాలు) తదితర అంశాలను వివరించారు.
ముగింపులో వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ ఎంజీయూ డిపార్ట్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి శిక్షణను నిర్వహించడం శుభపరిణామం అన్నారు. శిక్షణ కోర్సు డైరెక్టర్‌గా ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, కో డైరెక్టర్‌గా అసిస్టెంట్ ప్రొఫెసర్ మిర్యాల రమేశ్ వ్యహరించారు.
నేను గతంలో పలు యూనివర్సిటీలో ఇచ్చిన శిక్షణకు హాజరయ్యాను. కానీ ఎంజీయూ నిర్వహించిన రీసెర్చ్ మెథాడాలజీ శిక్షణలో పరిశోధనకు అవసరమైన ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. అత్యంత నిపుణులైన ప్రొఫెసర్లు పవర్ పాయింట్ ప్రజేంటేషన్తో అర్థమయ్యేలా అనేక విషయాలు వివరించారు. పీహెచ్డీ చేస్తున్న నేను నా గైడ్ చెప్పని ఎన్నో అంశాలను శిక్షణలో నేర్చుకున్నాను.
– అజిత్ నాయక్ , అసిస్టెంట్ ప్రొఫెసర్, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
నే న్యాయశాస్త్రం పీహెచ్డీ స్కాలర్‌ను. ఎంజీయూలో ఇచ్చిన శిక్షణలో దేశంలోనే నిపుణులైన అధ్యాపకుల ద్వారా రీసెర్చ్‌లోని టూల్స్, జర్నల్స్ రాసే విధానం, రీసర్చ్కు ఉపయోగపడే వెబ్సైట్ల నుంచి అంశాల సేకరణ తెలుసుకున్నారు. న్యూ ఢిల్లీకి చెందిన సెంట్రర్ యూనివర్సిటీకి చెందిన రోహన్బల్ల సార్ చెప్పిన విషయాలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి.
– చింతపల్లి సునీల్, లా పరిశోధన విద్యార్థి, తెలంగాణ యూనివర్సిటీ
పరిశోధన గ్రంధం రాసే విధానం, రీసెర్చ్‌కు ఉపయోగపడే వెబ్సైట్లు, క్వాలిటీ, క్వాంటిటీ రీసెర్చ్ మెథడ్స్ గురించి తెలుసుకున్నాను. ఎంజీయూ ప్రొఫెసర్ మిర్యాల రమేశ్ చెప్పిన ఆర్-టూల్ ఇంత వరకు ఎక్కడా వినలేదు. రీసెర్చ్‌లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటివి 75 రకాల టూల్స్ శిక్షణలో చెప్పారు.
– దీపక్, పరిశోధన విద్యార్ధి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ