మునుగోడు, మే 06 : మునుగోడు మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎత్తుకున్న లారీలకు ప్రత్యేకమైన సీరియల్ నంబరు కేటాయించాలని కోరుతూ మునుగోడు మండలం లారీ అసోసియేషన్ సభ్యులు మంగళవారం తాసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. మునుగోడు మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇక్కడనే ఉన్న రైస్ మిల్లుకు ధాన్యాన్ని దిగుమతి చేసే అవకాశం కల్పించింది. అయితే ఇక్కడ ధాన్యం ఎత్తుకున్న లారీలు మిల్లుకు చేరుకునే లోగా చండూరు, కనగల్లు, నల్లగొండ మండలాల నుంచి కూడా ధాన్యాన్ని ఎత్తుకున్న లారీలు ఇదే మండలానికి వస్తున్నట్లు తెలిపారు.
దీంతో మునుగోడులో ధాన్యాన్ని ఎత్తుకున్న లారీలకు కూడా కామన్ గా ఒకే సీరియల్ నంబరు కేటాయించడంతో ఒక్కొక్క లారీ కనీసం రైస్ మిల్లు దగ్గర నాలుగైదు రోజులు వేచి ఉండాల్సి వస్తుందన్నారు. దీంతో సకాలంలో మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించలేక పోతున్నట్లు చెప్పారు. కావునా మునుగోడులో ధాన్యాన్ని ఎత్తుకున్న లారీలకు ప్రత్యేకమైన సీరియల్ నంబరు కేటాయించాలని లారీ అసోసియేషన్ సభ్యులు కోరారు.