నల్లగొండ, మే 05 : నల్లగొండ జిల్లా కేంద్రంలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కళాభారతి నిర్మాణం చేపట్టాలని పలువురు కవులు, కళాకారులు సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. నల్లగొండలో గతంలో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి టౌన్ హాల్ ఉండేదని, కాలక్రమేణా అది శిథిలమవడంతో ప్రస్తుతం పూర్తిగా నేలమట్టం చేసినట్లు తెలిపారు.
టౌన్ హాల్ కూల్చివేత తర్వాత నల్లగొండలో కవులు, కళాకారులు తమ సాహిత్య, సాంస్కృతిక సభలు నిర్వహించుకోవడానికి తగిన చోటులేదన్నారు. విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం త్వరలోనే కళాభారతి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోమలి కళా సమితి అధ్యక్షులడు బక్క పిచ్చయ్య, సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.