చండూరు, జూలై 02 : శివన్నగూడెం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో శివన్నగూడెం వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ ప్రాజెక్టు. ఇది డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కింద చేపట్టిన పనుల్లో ఒకటి. దీని నుండి మునుగోడు నియోజకవర్గానికి సాగునీరు, తాగునీరు అందించడం, ఫ్లోరోసిస్ సమస్యను తగ్గించడమే దీని ఉద్దేశం అన్నారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 11.99 టీఎంసీలు అని, సుమారు లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ.1,600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారని పేర్కొన్నాయి. 2015లో శంకుస్థాపన జరిగిందని, కానీ పనులు ఇప్పటికీ ఇంకా ఆలస్యంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా మంత్రికి విన్నవించారు. మునుగోడు ప్రజల అవసరాల రిత్యా దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరగా పూర్తి చేయించాలని ఆయన కోరారు.