76వ గణతంత్ర దినోత్సవాలు ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని జాతీయ జెండా ఎగుర వేశారు. స్వీట్లు పంచారు. పలు పాఠశాలల విద్యార్థులు జాతీయ పతాకాలతో ర్యాలీ తీశారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లోని పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్లు ఇలా త్రిపాఠి, తేజస్ నందలాల్ పవార్ జాతీయ జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో స్టాళ్లను ప్రదర్శించారు. పరేడ్ గ్రౌండ్లో వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
నల్లగొండ, జనవరి 26 : రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని వారి జీవన విధానంలో మార్పులు తేవాలనే ఆలోచనతోనే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, ఈ పథకాలను కింది స్థాయిలో ఉన్న వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగాగా ఆమె ఆదివారం నల్లగొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి పోలీసుల నుంచి గౌరవం వందనం స్వీకరించారు. ఆ తర్వాత జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాధాన్యత కల్పించాలనే ఆలోచనతో జిల్లాలో 4,276 మంది ఎన్యుమరేటర్స్తో 5,11,638 ఇండ్లల్లో కుల సర్వే చేసినట్లు తెలిపారు. మహాలక్ష్మి కింద 3.75లక్షల మందికి ఉచిత బస్సు ప్రయాణం అందించడంతోపాటు 2,33,981 మందికి రూ.2,044.83కోట్లు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. గృహ జ్యోతి పథకం కింద 2,35,628 మంది లబ్ధిదారులకు 200యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అన్నారు.
ఎస్ఎల్బీసీలో 42ఎకరాల్లో వైద్య కళాశాల ప్రారంభించి ఐదు ఎకరాల్లో రూ.40కోట్లతో నర్సింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. నల్లగొండ, మునుగోడు నియోజక వర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం కోసం 25ఎకరాల చొప్పున కేటాయించి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. శాంతి భద్రతల విషయంలో ముందస్తు చర్యల్లో భాగంగా 3,280 సీసీ కెమారాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం పలు శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందచేశారు. పలు సంఘాలకు ఆస్తుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, ఆర్డీఓ శేఖర్ రెడ్డిలతో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.