కట్టంగూర్, ఏప్రిల్ 09 : నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి నుంచి కట్టంగూరు మండలం వరకు విస్తరించిన ఆసిఫ్‌నగర్ కాల్వకు తక్షణం నిధులు కేటాయించి పూడిక తొలగించి మరమ్మతులు చేపట్టాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కట్టంగూరు మండలంలోని పరడ గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆయన కాల్వను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1905లో నవాబ్ కాలంలో నిర్మించిన ఈ కాల్వకు ఇప్పటివరకు ప్రభుత్వాలు సరైన నిధులు కేటాయించకపోవడం వల్ల పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. కట్టంగూరు మండలంలోని సుమారు 15 గ్రామాలకు చెందిన 5,000 ఎకరాలకు ఈ కాల్వ ద్వారా సాగునీరు అందుతుందని తెలిపారు. ప్రస్తుతం కాల్వ చెట్లు, మట్టి, పూడికతో నిండిపోవడంతో పాటు గేట్లు కూడా శిథిలావస్థకు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపించి కాల్వ మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతులే స్వయంగా డబ్బులు వెచ్చించి మరమ్మతులు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొనడం దురదృష్ట కరమన్నారు. నిధుల కొరతతో గ్రామాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు సరైన పర్యవేక్షణ చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీసం రూ.10 లక్షలు కేటాయించి కాల్వను మరమ్మతు చేసి సాగునీరు అందించాలన్నారు. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పెంజర్ల సైదులు, గంజి మురళీధర్, మండల నాయకులు కొండూరు సత్తయ్య, గడగోజు రవీంద్ర చారి ముసుగు రవీందర్, జాల ఆంజనేయులు, కృష్ణ, ఎల్లయ్య, మారయ్య, గోలి రాములు పాల్గొన్నారు.