తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆదివారం ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగురవేసి వందనం చేశారు. భారత యూనియన్‌లో తెలంగాణ ప్రాంతం చేరి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నల్లగొండ పరేడ్‌గ్రౌండ్‌లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సూర్యాపేటలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. నల్లగొండ, సూర్యాపేటలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
నాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధి
‘రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చిరస్థాయిగా నిలుస్తుంది. నాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. 75 ఏండ్ల తెలంగాణలో ఈ పదేండ్లలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధించింది. ప్రధానంగా వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వచ్చాయి.
పుష్కలంగా సాగునీరు, 24 గంటల కరెంట్‌తో ధాన్యం ఉత్పత్తిలో దేశంలో అగ్రభాగాన ఉన్నది. దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 30 వేల కోట్ల రూపాయలతో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ దేశానికే వెలుగులు నింపనున్నది. స్వరాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం 268 గురుకులాలను ఏర్పాటు చేసి 6 లక్షల మంది విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నది.
ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. నల్లగొండ ఐటీ టవర్ ఏర్పాటుతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించనున్నాయి’- నల్లగొండలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
తెలంగాణలో ఎవరి కుట్రలూ సాగవు
‘తెలంగాణ రాష్ట్రంలో కొంత మంది లేని అపోహలు సృష్టించి పాత గాయాలను రగిలించి ఇక్కడి సమాజాన్ని చీల్చాలని చూస్తున్నారు. కేవలం ఓట్ల కోసం మాట్లాడి దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరు. తమ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ముందుకు పోతూ దేశంలో హైదరాబాద్‌కు, తెలంగాణకు ఏ పేరు ఉందో దానిని నిలబెడుతున్నది. అన్ని మతాలు, వర్గాల సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. నాటి హైదరాబాద్ సంస్థానం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో విముక్తి చెందింది.
భూ స్వాముల దోపిడీ నశించాలని, రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టాలని
జరిగిన తిరుగుబాటులో వేలాది మంది రైతులు ఆయుధాలు ధరించి పోరాటం చేశారు. ఈ పోరాటానికి దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. నేడు సురక్షిత ప్రాంతంగా తెలంగాణ మారింది. స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు చేరువయ్యాయి. నేడు ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా జరుపుకొన్నాం’- సూర్యాపేటలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజును పురస్కరించుకొని ఆదివారం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేసి వందనం చేశారు. ఆనాటి సాయుధ పోరాట యోధుల త్యాగాలను స్మరించుకున్నారు. రైతాంగా సాయుధ పోరాట వీరులను సన్మానించారు. నల్లగొండ పరేడ్‌గ్రౌండ్‌లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సూర్యాపేటలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు.
నల్లగొండ, సెప్టెంబర్ 17 : ‘నాడు ఎంతో మంది త్యాగధనులు చేసిన పోరాట ఫలితంగానే నేడు అన్ని రంగాల్లో నూతన రాష్ట్రం దూసుకెళ్తున్నది. తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17న రాచరిక వ్యవస్థ నుంచి భారత యూనియన్‌లో విలీనమైంది. ఈ 76 ఏండ్ల తెలంగాణ ఎంతో సాధించగలిగితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఈ పదేండ్లలో ప్రతి కుటుంబానికి ఫలాలను ఇవ్వగలిగాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లా వీరులు, వీరనారీల పాత్ర ఎనలేనిది’ అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నల్లగొండ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం జాతీయ జెండాను ఎగురవేశారు.
అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి గుత్తా మాట్లాడారు. తెలంగాణలో రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలుకడంలో అమరులైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు ఈ సందర్భంగా జోహార్లు తెలియజేశారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు అని, తెలంగాణ ప్రాంతం భారత యూనియన్‌లో విలీనమై 75ఏండ్లు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భమని అన్నారు. స్వేచ్ఛా, స్వాతంత్య్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారని, ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికిందని పేర్కొన్నారు.
రాచరిక వ్యవస్థ వ్యతిరేక పోరాటంలో నల్లగొండ పాత్ర కీలకం
అప్పట్లో దేశ వ్యాప్తంగా ఉన్న 565 సంస్థానాల్లో జునాఘడ్, కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు మినహా అన్నీ భారత యూనియన్‌లో విలీనమయ్యాయన్నారు. హైదరాబాద్ సంస్థానంలో భూస్వాములు, జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌ల వేధింపులు.. రజాకార్ల దమనకాండపై ప్రజలు తిరగబడ్డారని గుర్తు చేశారు. నాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభల ద్వారా ఎంతో మంది పోరాటం చేశారని, అందులో నల్లగొండ కమ్యూనిస్టుల పాత్ర చాలా కీలకమని అన్నారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొదటగా అసువులు బాసిన దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైందని పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లాకు చెందిన బండి యాదగిరి రాసిన ‘బండెనక బండి కట్టి’ పాట ప్రజల్లో చైతన్యం రగిలించిందని తెలిపారు. భూస్వామ్య, జమీందార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జిల్లాలోని గుండ్రాంపల్లి, కడివెండి, రావులపెంట, ఏనెమీదిగూడెం ప్రాంతాలు ఉద్యమానికి కేంద్ర బిందువులుగా నిలిచాయన్నారు. 1948 ఆగస్టు 27న జరిగిన బైరాన్‌పల్లి సంఘటన తరువాత 21 రోజులకే హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో చేరిందని చెప్పారు.
సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారం
హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో కలిసినప్పటికీ ఆనాటి కొందరి నాయకుల కుట్రల ఫలితంగా తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపారన్నారు. ఆంధ్రా పాలకుల అన్యాయాలకు వ్యతిరేకంగా తెలంగాణలో 1969లో ప్రారంభమైన తొలిదశ ఉద్యమంలో సుమారు 350 మంది అసువులు బాశారని గుర్తు చేశారు. నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ మలిదశ ఉద్యమంలో 14 సంవత్సరాల పాటు గాంధేయ మార్గంలో పోరాడారని, ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని తెలిపారు. అనతికాలంలోనే అద్భుత ప్రగతి సాధించి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపారన్నారు.
పదేండ్లలో ఎనలేని అభివృద్ధి
75 ఏండ్ల ఈ తెలంగాణ.. స్వరాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని గుత్తా అన్నారు. వ్యవసాయ రంగంలో, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి జిల్లాలోని వీర్లపాలెం వద్ద రూ.30వేల కోట్లతో చేపట్టిన 4వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని చెప్పారు.
విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు గురుకులాలను నెలకొల్పి దాదాపు 6లక్షల మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంతోపాటు జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడలను నెలకొల్పబడి నిరుద్యోగులకు ఉపాధి కల్పించబడుతుందని తెలిపారు. ఐటీ రంగాన్ని జిల్లా కేంద్రాలకు విస్తరించామని, ఇందులో భాగంగా నల్లగొండలో ఐటీ టవర్ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమైందని చెప్పారు. నీటిపారుదల రంగంలో ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని, పాలమూరు – రంగారెడ్డి, జిల్లాలోని ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్, డిండి ఎత్తిపోతల పథకం పనులు చేపడుతున్నామని తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌కుమార్, కలెక్టర్ అర్వీ కర్ణన్, ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్లు హేమంత్ కేశవ్ పాటిల్, జె.శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎం.సైదిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ రాంచందర్‌నాయక్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
రామగిరి : నల్లగొండ పోలీసు పరేడ్ గ్రౌండ్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఎంతో ఆకట్టుకున్నాయి. చివరలో వారందరికీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి బహుమతులు అందజేశారు.