గుర్రంపోడు, డిసెంబర్ 25: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏఎమ్మార్పీ ఆయకట్టుకు రెండు పంటలకు నీరు అందిస్తున్నది. ఈ క్రమంలోనే ప్రస్తుతం యాసంగి సీజన్లో నీటి విడుదల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆయకట్టుతో పాటు వరద కాల్వకు నీటి విడుదల షెడ్యూల్‌ను చీఫ్ ఇంజినీరు అజయ్ ఆదివారం ప్రకటించారు. రైతులు నీటి విడుదల కాలం లో పంటల సాగును ముగించుకునే ప్రణాళికతో సాగు సమాయత్తానికి నారు మడులు సిద్ధ్దం చేసుకునే వీలు ఉంటుంది. పానగల్ ఉదయ సము ద్రం నిండుగా ఉండడం, ఆయకట్టులో వరికోతలు ఆలస్యం కావడం తో యాసంగి నీటి విడుదల ప్రకటన రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మూడు లక్షల ఎకరాల ఆయకట్టు
ఏఎమ్మార్పీ హైలెవల్ కెనాల్ కింద 2.20 లక్షల ఆయకట్టు, వరద కాల్వ కింద 80 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. బోర్లు, బావులు ఆధారంగా కాకుండా కాల్వల కిందనే యాసంగి సీజనులో లక్ష ఎకరాల్లో ఆరుతడి పంటల సాగు జరుగుతుందని అధికారుల అంచనా..
120 రోజుల పాటు నీటి విడుదల
వారబందీ విధానంలో వారం విడిచి వారం 120 రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుంది. ఆయకట్టుకు 800 క్యూసెక్కుల నీటి విడుదలతో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 525 క్యూసెక్కులు, మిషన్ భగీ రథకు 25 క్యూసెక్కులు, కొదండాపురం ప్లాంట్‌కు 18 క్యూసెక్కులు నీటి విడుదల జరుగనుంది. ఆయా డివిజన్లలోని మేజర్ చెరువులైన చేపూర్, జి.యడవెల్లి, కనగల్ చెరువులు నింపనున్నారు.
ఆరుతడి పంటలు మాత్రమే సాగుచేసుకోవాలి
రైతులు లాభదాయకమైన ఆరుతడి పంటలను సాగుచేసుకొని నీటిని పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలి. కాల్వలకు గండి పెట్టి ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు నీరు అందకపోతే అధికారుల దృష్టికి తేవాలి. అవసరమైతే సమస్యను వెంటనే పరిష్కారిస్తామని అన్నారు.
– అజయ్‌కుమార్,ఇన్చార్జి సీఈ