గరిడేపల్లి, ఫిబ్రవరి 03 : రీ సర్వేతో రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆర్డీఓ శ్రీనివాసులు అన్నారు. ఆర్ ఓ ఆర్ యాక్ట్ (భూ భారతి)–2024 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీ–సర్వే పైలట్ ప్రాజెక్టులో భాగంగా గరిడేపల్లి మండలంలోని గానుగబండ గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిగా హాజరై మాట్లాడారు. రీ–సర్వేతో భూ రికార్డుల శుద్ధి జరిగి రైతులకు స్పష్టమైన హక్కులు కలుగుతాయన్నారు. రీ–సర్వే ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, దశల వారీగా అమలు చేస్తామని వెల్లడించారు.
ముందుగా గ్రామ సరిహద్దులు నిర్ణయించి అనంతరం ప్రభుత్వ భూముల సర్వే, ఆ తర్వాత రైతుల పట్టా భూముల సర్వే చేపడతామని వివరించారు. రైతులు సహకరించి రీ సర్వేను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గానుగుబండ సర్పంచ్ కడియాల పద్మ అప్పయ్య, కొండయ్యగూడెం సర్పంచ్ కందుల మంగమ్మ కోటిరెడ్డి, సర్వే డివిజనల్ ఇన్స్పెక్టర్ వంశీ, తాసీల్దార్ స్రవంతి, మండల సర్వేయర్ భాస్కర్, మండల గిర్దావర్ ప్రవీణ్, రాంబాబు, కృష్ణవేణి, గ్రామ పాలన అధికారులు, రెవెన్యూ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Land Re-survey : రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : ఆర్డీఓ శ్రీనివాసులు