పెద్దఅడిశర్లపల్లి, మే 12 : నెలల తరబడి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ధాన్యం కొనుగోళ్లలో సర్కారు పూర్తిగా విఫలమైందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గుడిపల్లి మండలంలోని ఘనపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి జిల్లా సివిల్ సప్లయ్ అధికారులతో మాట్లాడారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల ధాన్యాన్ని వదిలి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, అధికారుల అందాల పోటీల ఏర్పాట్లలో మునిగిపోయారని విమర్శించారు.
నెల రోజుల క్రితం తీసుకొచ్చిన ధాన్యాన్ని మాశ్చర్ కూడా చూడటంలేదని, మిల్లర్లు తమ టార్గెట్ పూర్తయ్యిందని చేతులు ఎత్తివేశారని అన్నారు. లారీలు అందుబాటులో లేకపోతే రైతుల ట్రాక్టర్లలో ధాన్యాన్ని మిల్లర్లు తరలించే అవకాశం కల్పించాలని, తేమ పేరుతో కోత విధిస్తే రైతులతో కలిసి ధర్నాలు చేపడుతామని చెప్పారు. మంత్రులు గాలి మోటార్లలో అధికారిక పర్యటనలు తప్ప రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా తన ధాన్యాన్ని ఎగుమతి అయ్యేలా చూడాలని రైతులు రవీంద్రకుమార్‌కు మొర పెట్టుకున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వల్లపురెడ్డి, నాయకులు మునగాల అంజిరెడ్డి, అర్వపల్లి నర్సింహ, సుధాకర్ గౌడ్, శ్రీను, మహేందర్, యాదగిరి, కృష్ణారెడ్డి, గోలి గిరి ఉన్నారు.