సూర్యాపేట, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): గ్రామం లో ఓ పెద్ద మోతేబరి కాదు కానీ అక్కడ ఆయన పేరు చెబితే ఎనిమిది దశాబ్దాలుగా ఆయన చేపట్టిన పనులను గుర్తు చేసుకుంటూ “ఓ ఆయనా” అని సంభోదిస్తారు. ఏనాడూ ఏ పార్టీలో చేరకుండా..ఏదో ఒక పదవికి పోటీ చేయమన్నా ససేమిరా అంటూ సున్నితంగా తిరస్కరిస్తూ ఏ ఒక్క రాజకీయ పార్టీలో చేరకుండా అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటూ తన గ్రామానికి ఏం కావాలో వాటన్నింటిని సాధిస్తూ వచ్చారు. ఎంతో మం దిని ప్రజాప్రతినిధులుగా చేయడంలో ఆయన కృషి ఎనలేనిది.
గ్రామంలో ఎవరైనా ఏ పని ఉందన్నా ఇప్పటికీ తెల్ల పంచెతో గోచీని చెక్కి తెల్లటి అంగీ వేసుకొని సర్రుసర్రున వెళ్లిపోవడం ఆయన నైజం. పంచాయతీ ఎన్నికల్లో ఆ ఊరు సర్పంచ్ జనరల్ కావడంతో ఊళ్లో పెద్ద, చిన్న తేడా లేకుండా గెలిపించుకుంటాం, బరిలో నిలవాలని కోరితే జనం ఆకాంక్ష మేరకు బరిలోకి దిగానంటున్నారు. ఆయన ఎవరో కాదు నాటి నైజాం కాలంలో 25 గ్రామాలతో కూడిన నాగారం రెవెన్యూ ఫిర్కా, ప్రస్తుత నాగారం గ్రామానికి చెందిన 95 ఏళ్ల గుంటకండ్ల రామచంద్రారెడ్డి. 1929లో జన్మించిన రామచంద్రారెడ్డి నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని తరగతులు చదివేందుకు దూర ప్రాంతాలకు వెళ్లినా చివరకు హెచ్ఎస్సీ నాగారంలోనే పూర్తి చేశారు.
1957లో ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లి కోదాడ మండలం తమ్మర, సిరికొండ ఉన్నత పాఠశాల, మామిడాలలో పని చేసి 1960లో ఉద్యోగానికి రాజీనామా చేసి నాగారంలో పట్వారీగా కూడా పని చేశారు. గ్రామానికి చేయాలనుకున్నవి ఎన్నో చేశారు. గ్రామ ప్రజలకు కావాల్సిన వసతుల కల్పన కోసం అందరి సహకారంతో ఎన్నో చేశా. ప్రజలు కావాలనుకున్న నాయకుడిని గెలిపించేందుకు ఒక్కో సారి ప్రాణాలమీదకు తెచ్చుకోవడం, కేసుల పాలైనా అనుకున్న పంథాను విడనాడలేదు… ప్రజలకు కావాల్సినవి ఇవ్వకుండా వెనుకడుగు వేయలేదు.
దవాఖాన నిర్మాణం..
1984-85లో ఆబ్కారీ, కల్లు దుకాణాల వల్ల వచ్చిన ఆదాయంతో రెండేండ్లలో రెండెకరాల భూమిని కొని వాటిని ప్రభుత్వానికి రాసిచ్చి అందులో దవాఖాన నిర్మాణం చేయించారు. 1975లోనే రామచంద్రారెడ్డి అర్వపల్లి నుంచి ప్రత్యేక స్తంభాలు, వైర్లు లాగించి గ్రామంలో విద్యుత్ వెలుగులు నింపారు. వీటితో పాటు ఊరికి మంచినీటి నల్లాలు ఏర్పాటు చేయించారు.
1959లోనే అన్ని వర్గాలకు ఇంటి స్థలాలు..
రామచంద్రారెడ్డి ఎలాంటి పదవి కోరుకోకుండా పదవిలో ఉన్న వారితో సత్సంబంధాలు కలిగి ఉంటూ గ్రామానికి కావాల్సిన అన్నింటినీ చక్కదిద్దేవారు. తన ఆస్తులను సైతం పేదలకు పంచారు. 1959లో గ్రామంలోని 60 ఎస్సీ మాదిగ కుటుంబాలకు ఇండ్ల స్థలాలు ఇప్పించి వారికి కావాల్సిన సామగ్రిని ఇప్పించారు. గ్రామానికి ఆనుకొని ఉన్న తన 4 ఎకరాల సొంత భూమిని ఎస్సీ మాలలకు ఇండ్ల స్థలాల కింద ఇచ్చి ఔదార్యం చాటుకున్నారు. బీసీలకు 8 ఎకరాల భూమిని రైతులతో ఇప్పించి వారికి ప్రభుత్వం ఎకరాకు రూ.5వేల చొప్పున చెల్లిస్తే రామచంద్రారెడ్డి ఎకరాకు మరో రూ.5వేల చొప్పున ఇచ్చి ఆర్థికంగా ప్రొత్సహించారు. నాటి లబ్ధిదారులు నేడు కాసింత ఓపిక తెచ్చుకొని రామచంద్రారెడ్డికి భారీ మెజారిటీ రావాలని ప్రచారం చేస్తుండటం గమనార్హం. గ్రామానికి ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఊరి పెద్దలు ఎన్నో విషయాలు చెబుతున్నారు.
నాగారంలో గౌడ కులస్తుల సంక్షేమానికి సొసైటీ ఏర్పాటు చేయించడం, గ్రామంలో కొత్తగా పెండ్లి చేసుకున్న వారికి ధర్మ పుస్తెలు అందించేవారు. ఊరికి కొత్తగా రెండు బావులు మంజూరైతే అవి సరిపోవని కొట్లాడి మరో మూడు బావులకు పెంచి మొత్తం ఐదు బావులు తవ్వించారు. వాటికి ఆయిల్ ఇంజన్లు, నూనె డ్రమ్ములు ఇప్పించారు. రామచంద్రారెడ్డి చొరవతో 1972లోనే గ్రామంలో సిండికేట్ బ్యాంకు ఏర్పాటైంది. 1962 నుంచి 1980 వరకు సరైన విద్యా వసతి లేకపోవడంతో రామచంద్రారెడ్డి ఊరితో పాటు దూర ప్రాంతాలకు చెందిన వందలాది మంది విద్యార్థులకు తన నివాసంలోనే నాన్ ప్లాన్ హాస్టల్ ఏర్పాటు చేసి ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేశారు. ఆ హాస్టల్లో ఉంటూ చదువుకున్న వారు నేడు దేశ విదేశాల్లో పలు రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు.
ఆ మూడు చేస్తే జీవితంలోసంతృప్తి
తాను చేసిన పనులు ఎన్నో ఉన్నా నేడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాగారం జనరల్ కావడంతో ఒక్కసారి బరిలో దిగు… నిన్ను మేం గెలిపించుకుంటం అనడంతో 95ఏండ్లు పూర్తి కావొస్తున్నా ప్రజల ఆకాంక్ష మేరకు బరిలోకి దిగుతున్నానని రామచంద్రారెడ్డిని ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. తన సొంత స్థలంలో గ్రామస్తులు ఫంక్షన్లు చేసుకునేందుకు ఓ కమ్యూనిటీ హాల్, లైబ్రరీ, స్కూల్ భవనం నిర్మిస్తానన్నారు. ఈ మూడు చేయాలనే తపన ఉంది… గెలుస్తున్నా… గెలిస్తే కచ్చితంగా చేసి తీరుతానంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇవి పూర్తయితే జీవిత చరమాంకంలో ఎంతో సంతృప్తి మిగులుతుందంటున్నారు.