కోదాడ, నవంబర్ 19 : సీఎం రిలీఫ్ ఫండ్ అవినీతి వ్యవహారంలో రిమాండ్కు పంపిన కర్ల రాజేశ్ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందలేదని, పోలీసుల చిత్ర హింసలతోనే దుర్మరణం పాలయ్యాడని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, దళిత సంఘాల నేతలు, పలు పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం కోదాడ గాంధీనగర్ ప్రధాన రహదారిపై రాజేశ్ మృతదేహంతో బైఠాయించి ధర్నా నిర్వహించారు. బాధ్యుడైన చిలుకూరు ఎస్ఐ పై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, కలెక్టర్, ఎమ్మెల్యే పద్మావతి ధర్నా వద్దకు వచ్చి రాజేశ్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేందుకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విశారదన్ మహారాజ్, దళిత సంఘాల నేతలు రాజేశ్ మృతి పట్ల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాజేశ్ పోలీసుల లాఠీ దెబ్బలతోనే మృతి చెందాడని ఆరోపించారు. ఆయన మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు రూ.30 వేలు సంపాదించే కొడుకు మరణంతో వృద్ధ్యాప్యంలో ఉన్న తల్లి, వికలాంగుడైన తమ్ముడు అనాథలు అయ్యారని, ప్రభుత్వం వెంటనే దిగివచ్చి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసేందుకు హామీ ఇవ్వాలన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి ప్రతి సందర్భంలోనూ కోదాడ, హుజూర్నగర్ ప్రజలు తమ బిడ్డలని చెపుతుంటారని, ఒక దళిత బిడ్డ పోలీసు దెబ్బలకు మృతి చెంది ఆ కుటుంబం బజారున పడ్డదని, ఔదార్యంతో ఆదుకోవాలని వారు కోరారు.
రాజేశ్ మృతదేహంతో ఆందోళన చేస్తున్న నాయకులతో ఆర్డీఓ సూర్యనారాయణ చర్చించారు. కుటుంబాన్ని ఆదుకుంటామని అందులో భాగంగా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇందిరమ్మ ఇల్లు, మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని ఇచ్చిన హామీని తిరస్కరించారు. తక్షణమే కలెక్టర్ స్పందించి కనీసం రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, లేనట్లయితే అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా వెనుకాడబోనని విశారదన్ మహారాజ్ ఆర్డీఓకు స్పష్టం చేశారు. ఆందోళనను విరమింపచేసేందుకు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో హుజూర్గనగర్, కోదాడ పట్టణ సీఐలు చరమంద రాజు, శివ శంకర్ నాయక్, ముగ్గురు ఎస్ఐలు, 70 మంది పైగా పోలీస్ సిబ్బంది మోహరించారు.

Kodada : పోలీసుల చిత్రహింసలతోనే రాజేశ్ మృతి : డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్