రాజాపేట, మార్చి 15 : సూర్యాపేట జిల్లాలోని రాజాపేటను కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ మండల కార్యదర్శి చిగుళ్ల లింగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని సింగారం గ్రామంలో ఎండిపోయిన వరి పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎండిపోయిన వరి పంట వివరాలు ప్రభుత్వం వెంటనే సేకరించి రైతులకు ఎకరాకు రూ.25 వేల నష్ట పరిహారం చెల్లించాలన్నారు. పెట్టుబడులు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించకుంటే పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన చేయనున్నట్లు హెచ్చరించారు.
కిలోమీటర్నర కాల్వ తవ్వితే సింగారం గ్రామ చెరువు నిండి మండలంలోని అన్ని చెరువులు నింపేందుకు ఆస్కారం ఉన్నా కూడా పట్టించుకోకుండా పాలకులు నిర్లక్ష్యం చేయడంతోనే రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. గ్రామానికి చెందిన ఆకుల బాల నరసయ్య మూడు ఎకరాలు, పారుపల్లి చంద్రారెడ్డి రెండు ఎకరాలు, బొల్లారం మల్లయ్య రెండు ఎకరాలు, ముచ్చెనపల్లి సిద్దయ్య రెండు ఎకరాలు, బుచ్చిరెడ్డి మూడు ఎకరాలు, కర్ల కిష్టారెడ్డి మూడు ఎకరాలు, కర్ల మల్లారెడ్డి మూడు ఎకరాలు, బండకింది బాల మల్లు రెండు ఎకరాలు, వంపు స్వామి ఎకరంన్నర నీళ్లు లేక వరి పంట నష్టపోయి పశువుల మేతకు వదలాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు.