దసరా పండుగ పూట ట్రిపుల్ ఆర్ రైతులపై సరార్ పిడుగు వేసింది. విజయదశమి రోజున బహిరంగ నోటీస్ ఇచ్చింది. వలిగొండ, చౌటుప్పల్ మండలాల గ్రామాలకు చెందిన భూములు ప్రభుత్వానికి సంక్రమించాయంటూ అందులో పేరొంది. ఇందులో భాగంగా చౌటుప్పల్ ఆర్డీఓ 3జీ నోటిఫికేషన్ జారీ చేశారు. అవార్డు పాస్ కోసం వివరాలు తీసుకోనున్నారు. ఇప్పటికే పెద్దఎత్తున ఉద్యమిస్తున్న రైతులు మాత్రం భూములు ఇచ్చేది లేదని అల్టిమేటం జారీ చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారత్ మాల పరియోజన కింద రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న అలైన్మెంట్ ప్రకారం ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం మొత్తం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 19 మండలాలకు చెందిన 113 గ్రామాల మీదుగా వెళ్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 34 గ్రామాల మీదుగా ఆర్ఆర్ఆర్ నిర్మించనున్నారు. జిల్లాలో 59.33 కిలోమీటర్లు ఉండనుంది. అందుకు తురపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లో 1,927 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దీనికి సంబంధించి త్రీడీ నోటిఫికేషన్ కూడా జారీ అయ్యింది.
ట్రిపుల్ ఆర్‌లో భాగంగా విలువైన భూములు పోతున్నాయని రైతులు పోరు బాట పట్టారు. ప్రధానంగా చౌటుప్పల్‌లో జంక్షన్ కు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సర్వం కోల్పోతున్నామని రైతులు లబోదిబోమంటున్నారు. సర్వే పనులు అడ్డుకుంటున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమయ్యారు. చౌటుప్పల్‌లో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. పలుసార్లు స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ ఇందిరా పార్ వద్ద దీక్ష నిర్వహించారు. ఎంపీలతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతి పత్రాలు అందించారు. ప్రభుత్వం మాత్రం ఆర్ఆర్ఆర్పై ముందుకే వెళ్తున్నది. రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు.
ట్రిబుల్ ఆర్ భూనిర్వాసితులకు భూమికి భూమి ఇస్తే సరే లేకుంటే రోడ్డును ఎయ్యనిచ్చే ముచ్చటే లేదు. మాకున్న వ్యవసాయ క్షేత్రం నుంచి సుమారు ఐదు ఎకరాల మేర ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణానికి పోతుందని అధికారులు అంటున్నారు. బహిరంగ మార్కెట్లో ఒక ఎకరం 80 లక్షల రూపాయల వరకు అమ్ముడు కొనుడు నడుస్తుంది. ఐదు ఎకరాలకైనా సుమారు 4 కోట్లు ఉంటుంది. ఎకరానికి 20 నుంచి 30 లక్షలలోపు నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వచ్చే పైసలతో ఇక్కడ ఎకరం కూడా దొరికే పరిస్థితి లేదు. మేము భూమి మీద ఆధారపడి బతికేటోళ్లం. మా జీవితాలను ప్రభుత్వం ఏ చేయదలుచుకుంది. ప్రభుత్వం మాకు భూమికి భూమి ఇచ్చి న్యాయం చేయాలి.
మేము ముగ్గురం అన్నదమ్ములం. మా నాన్న పేరు మీద 12 ఎకరాల భూమి ఉంది. వారసత్వంగా వస్తున్న ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. ముగ్గురం వ్యవసాయమే చేస్తాం. దాదాపు మాకు ఉన్న భూమి జంక్షన్‌కు పోతుంది. ఉన్న భూమి పోతే ఎలా బతకాలి. ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇవ్వం. అధికారులకు కూడా మా పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డ్స్ ఇవ్వం.
చౌటుప్పల్ మండలంలోని ఆరు గ్రామాలు, వలిగొండ మండలంలోని ఐదు గ్రామాల మీదుగా ట్రిపుల్ ఆర్ రోడ్డు వెళ్తున్నది. ఆయా చోట్ల 133.178 కిలోమీటర్ నుంచి 158,645 కిలోమీటర్ రహదారి నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల ఒకటిన 3డీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. తాజాగా 12న 3జీ నోటిఫికేషన్ విడుదల చేశారు. 3డీ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ఎలాంటి వివాదాలు లేవని, 3డీలోని సబ్ సెక్షన్ 2 ప్రకారం భూములు భారత ప్రభుత్వానికి సంక్రమించినట్లుగా బహిరంగ నోటీస్‌లో పేరొన్నారు. వలిగొండ మండలంలోని పొద్దుటూరు, రెడ్లరేపాక, పహిల్వాన్పూర్, గోకారం, వరట్పల్లి, చౌటుప్పల్ మండలంలోని తాళ్లసింగారం, చిన్నకొండూరు, తంగడపల్లి, నేలపట్ల, చౌటుప్పల్, లింగోజిగూడెం గ్రామాలకు సంబంధించి 213 ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకోనుంది.
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలి. లేదా భూమికి బదులు భూమి ఇవ్వాలి. లేదంటే బహిరంగ మారెట్ ధర కట్టించాలి. అంతేగాని ప్రభుత్వం 3జీ బహిరంగ నోటీస్ జారీ చేసి రైతుల పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్‌ను తీసుకురా అని చెప్పడం సరైంది కాదు. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. తాసీల్దార్ కార్యాలయం నిర్వహించే సమావేశాలను కూడా పూర్తిగా బహిషరిస్తాం. ఎంతటి పోరాటాలకైనా సిద్ధమే.