నకిరేకల్, ఆగస్టు 10 : నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్‌పై అవిశ్వాసం పేరిట బీఆర్ఎస్ కౌన్సిలర్లను బెదిరించి సంతకాలు చేయించుకున్నారని, పోలీస్ స్టేషన్ల వేదికగా ప్రజా పాలన కొనసాగుతుందని, ఈ విషయాలను ప్రజలు గమనిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమమైందన్నారు. అధికారంలో వచ్చి 8 నెలలవుతున్నా 6 గ్యారెంటీలు అమలు కావడం లేదని తెలిపారు.
నియోజకవర్గంలోని గ్రామాల్లో రైతులకు సమస్యలు సృష్టించి కాంగ్రెస్ నాయకులు లక్షల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. పోలీస్స్టేషన్ల చుట్టూ రైతులు తిరుగలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం పేరిట బెదిరించి సంతకాలు చేయించుకున్నారని, చైర్మన్ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయాలని, ఇంటి దగ్గర కూర్చొని ఎవరికీ బిల్లులు రాకుండా తీర్మానాలు చేయడం అటవిక పాలనకు నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో నకిరేకల్ నియోజకవర్గంలో రూ.వందల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, వంద పడకల ఆస్పత్రి, రోడ్లు, వైకుంఠధామాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, కౌన్సిలర్ పల్లె విజయ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ యాదగిరి, నడికుడి వెంకటేశ్వర్లు, రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు సామ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేశ్, రాచకొండ వెంకన్న పాల్గొన్నారు.