రామగిరి, ఆగస్టు 30 : కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పీఆర్టీయూ భవన్ నుండి రామగిరి, శివాజీ నగర్, వివేకానంద విగ్రహం, హైదరాబాద్ రోడ్డు, ఎన్జీ కళాశాల మీదుగా కొనసాగిన ర్యాలీ గడియారం సెంటర్కు చేరుకుంది. అక్కడ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు కాళం నారాయణ్ రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లా నుండి పీఆర్టీయూ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ ర్యాలీలో జిల్లా మాజీ అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు తిరందాస్ సత్తయ్య, ఉపాధ్యాయులు వెంకటరెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.