పెన్‌పహాడ్, సెప్టెంబర్ 05 : కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో పంటలు నష్ట పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, పంటలు సాగు చేసి నెల రోజులు గడుస్తున్నా సకాలంలో యూరియా చల్లక పైరు ఎదగడం లేదు.. యూరియా కోసం పనులు వదులుకుని కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్నాం.. దండం పెడుతాం.. యూరియా అందించండి.. లేదంటే దిగిపొండి.. అంటూ పెన్‌పహాడ్ మండల కేంద్రంలో సూర్యాపేట- నేరేడుచర్ల ప్రధాన రహదారిపై శుక్రవారం రైతులు ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని చీదెళ్ల సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. ముందుగా టోకెన్లను జారీ చేస్తామని సిబ్బంది తెలుపగా రైతులు ఉదయం గంటల తరబడి పడిగాపులు కాశారు.
చీదెళ్ల సహకార సంఘానికి 550 యూరియా బస్తాలు రాగా అక్కడికి 2 వేల మంది రైతులు రావడంతో తమకు పూర్తి స్థాయిలో యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నా, రాస్తారోకో చేపట్టారు. గత పది రోజులుగా యూరియా కోసం ఎదురు చూస్తున్నా తమకు సరిపడా యూరియా అందించడం లేదని వాపోయారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ కాస్తల గోపికృష్ణ సిబ్బందితో అక్కడకు చేరుకుని రైతులను శాంతింపజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు గాసినా ఒక్క యూరియా బస్తా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా దొరకని రైతులు ప్రభుత్వనికి శాపనార్థాలు పెడుతూ అక్కడికి నుంచి నిరాశతో వెనుతిరిగారు.
మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ.. చీదెళ్ల పీఏసీఎస్‌కు 550 యూరియా బస్తాలు వచ్చాయి. రైతులు ఎక్కువ వచ్చినందున ఇంకొక 200 బస్తాలు తెప్పించాం. 321 మంది రైతులకు ఇచ్చాం. మిగిలిన వారికి రేపు వచ్చాక ఇస్తాం. రైతులందరికీ సకాలంలో యూరియా అందేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Penpahad : ‘సరిపడా యూరియా అందించండి.. లేదంటే దిగిపోండి’