సూర్యాపేట : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్యులపై ధరల భారాన్ని మోపి జేబులు కొల్లగొడుతుందని ప్రగతిశీల మహిళా సంఘం (pow) జిల్లా కార్యదర్శి కంచర్ల నర్సక్క అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని తుమ్మల పెన్పహాడ్లో ఖాళీ సిలిండర్లతో పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గృహ వినియోగ ఎల్ పి జి సిలిండర్లపై రూ. 60, కమర్షియల్ సిలిండర్ లపై రూ 115 పెంచడం పేదల జీవితాలపై ఆర్థిక దాడి చేయడమేనని అన్నారు. యుద్ధాల పేరుతో నిత్యావసర ధరలు పెంచుకుంటూ పోతే పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితి కుందేలు అవుతుందని మండిపడ్డారు.
బిజెపి అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలో ఇప్పటికే అనేకసార్లు గ్యాస్ ఆయిల్ ధరలు పెంచిందని మండిపడ్డారు. దేశభక్తి అంటే ప్రజల ఆస్తులను లూటీ చేయడం కాదని, ప్రజల ఆర్థిక అభివృద్ధిని సాధించడం అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కొరివి మంగమ్మ, పులిగుజ్జు లక్ష్మి, నల్లగొండ రమ్య, భద్రమ్మ, వెంకటమ్మ, మంగమ్మ, రోశమ్మ, తదితరులు పాల్గొన్నారు.