కోదాడ, నవంబర్ 18 : సీఎం రిలీఫ్‌ఫండ్ అవినీతి కేసులో పోలీసులు రిమాండ్‌కు తరలించిన కర్ల రాజేశ్ హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రాజేశ్ మృతి విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని, న్యాయ విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాజేశ్ తల్లి, బంధువులు, మిత్రులు, ధర్మ సమాజ్ పార్టీ బాధ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు కోదాడ ప్రధాన రహదారిపై ఉన్న డీఎస్పీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ శ్రీధర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సీఎం రిలీఫ్‌ఫండ్ కేసు విషయంలో తన కుమారుడిని ఈనెల 4న చిలుకూరు పోలీసులు తీసుకెళ్లి కేసు నమోదు చేసి, 8వ తేదీ వరకు హుజూర్నగర్ జైలులో ఉంచారన్నారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడిని వైద్యం కోసం హుజూర్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారన్నారు.
అక్కడి వైద్యుల సూచన మేరకు రాజేశ్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించి ఆదివారం మృతదేహాన్ని అప్పగించారని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకోవాలని, కుటుంబాన్ని పోషించే పెద్ద కొడుకు చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడిందని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డిని, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆర్డీవో రాజేశ్ మృతి బాధాకరమని, అతడి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి కోదాడ మున్సిపాలిటీలో ఉద్యోగంతోపాటు, కొంతమేర ఆర్థిక సాయం అందించేందుకు కలెక్టర్‌తో మాట్లాడతానని భరోసా ఇచ్చారు. ఆర్డీవో, డీఎస్పీ భరోసా మేరకు వారు ఆందోళనను విరమించారు. కాగా తక్షణ ఖర్చుల నిమిత్తం కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు రూ.50 వేలను రాజేశ్ కుటుంబానికి అందజేస్తానన్నారు. రాజేశ్ మృతికి పోలీసులను బాధ్యులను చేస్తూ హైకోర్టు పిటిషన్ స్వీకరించింది. తెలంగాణ హైకోర్టు విచారణకు ఆదేశాలు జారీ చేసింది.