కోదాడ టౌన్, ఏప్రిల్ 25 : అన్యాక్రాంతమైన భూమిని తిరిగి ప్రభుత్వ ఆస్పత్రికి అప్పగించాలి డిమాండ్ చేస్తూ ఈ నెల 28న సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మండుటెండలో నిరసన దీక్ష చేయనున్నట్లు సామాజిక కార్యకర్త పొడుగు హుస్సేన్ తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని కొల్లు వెంకటేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక కార్యకర్త కుదరవెల్లి బసవయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. కోదాడ ప్రభుత్వ ఆస్పత్రి స్థలం అన్యాక్రాంతం అయిందని తాను ఎన్నో ఏళ్లుగా పూర్తి ఆధారాలతో పోరాటం చేస్తున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కానీ, వ్యక్తిగతంగా ఎవరిపైనా ఎలాంటి కక్ష లేదన్నారు. అన్ని ఆధారాలు ఉండి కూడా పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆస్పత్రి స్థలం కబ్జాకు గురి కావడం, దానిని కాపాడాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా ఉండటం క్షమించరాని నేరం అన్నారు. 100 పడుకల ఆస్పత్రి నిర్మాణం పూర్తి అయితే అన్యాక్రాంతం అయిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం కష్టతరం అవుతుందని, తన పోరాటం చివరి అంకానికి వచ్చిందని ఇక చేసేదేమీ లేక విసుగు చెంది దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కలుగజేసుకుని అన్యాక్రాంతమైన ప్రభుత్వ ఆస్పత్రి భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు తన పోరాటం ఆగదని పేర్కొన్నారు.