సూర్యా పేట, ఫిబ్రవరి 11 : అధికార కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా కష్టపడి పని చేస్తే కౌన్సిలర్ టికెట్ ఇవ్వకపోగా తాను స్వతంత్రంగా పోటీ చేస్తే పోలింగ్ సెంటర్లోకి అనుమతించకుండా పోలీసులతో దౌర్జన్యాలు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 25వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోడి శిరీష శివ యాదవ్ ఆరోపిస్తూ బుధవారం ఆ వార్డు పోలింగ్ కేంద్రం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వతంత్ర అభ్యర్థిగా తాను ఫుట్బాల్ గుర్తుపై పోటీ చేస్తూ గెలుస్తున్నాననే భయంతో అధికార కాంగ్రెస్ పార్టీ తనపై దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోలింగ్ కేంద్రంలో తిరుగుతున్నాడని, తమను మాత్రం పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఉండమని పోలీసులు తరుముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదేమని ప్రశ్నిస్తే సమాధానం లేదన్నారు. తమకు మద్దతు ఇచ్చే వారిని సైతం బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం నేరమా? అభ్యర్థులకు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే హక్కు లేదా అని ప్రశ్నించారు. అధికార పార్టీ అయితే ఏది చేసినా నడుస్తుందా ఎవరిపైన అయినా దౌర్జన్యాలు చేయవచ్చా అని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు పోలింగ్ కేంద్రం వద్దకు భారీ ఎత్తున చేరుకుని ధర్నా చేస్తున్న వారిని, వారి మద్దతుదారులను చెదరగొట్టారు.