– ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ మాదిగ
నకిరేకల్, నవంబర్ 08 : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మీద దాడి జరిగి నెల రోజులు కావస్తున్న ఇప్పటికీ కేసులు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 17న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఢిల్లీలో పెద్ద ఎత్తున దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అలాగే అనుబంధ సంఘాల కార్యవర్గ సమావేశం ఎన్ఎస్ లక్ష్మి ఫంక్షన్ హాల్లో సూర్యాపేట జిల్లా ఇన్చార్జి బచ్చలకూర వెంకటేశ్వర్లు మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ స్థానంలో ఉన్న దళితుడికే రక్షణ లేకపోతే దేశంలో సామాన్య దళితులకు రక్షణ ఎలా ఉంటుందన్నారు. ఈ దాడి జరిగి నెల రోజుల కావస్తున్నా ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడం దారుణమని అన్నారు. జస్టిస్ గవాయ్ గారి స్థానంలో ఉన్నత కులాలకు చెందిన జడ్జీ ఉంటే కేసు నమోదు చేయడంలో ఇలా నిర్లక్ష్యం చేసి ఉండే వారా? అని ప్రశ్నించారు. అందుకే జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద జరిగిన దాడి దళితులపైన జరిగిన దాడిగా చూస్తున్నామన్నారు.
దళితులు ఎంత ఉన్నత స్థానానికి కష్టపడి ఎదిగినా కుల రక్కసి వెంటాడుతుందన్నారు. అందుకే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించారు. న్యాయవ్యవస్థ, జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించకుండా కుల వివక్షతను పక్షపాతాన్ని చూపాయన్నారు. అందుకే గవాయిపై దాడి ఘటనను నిరసిస్తూ జాతీయ స్థాయిలో దళితుల ఆత్మగౌరవ పోరాటం చేపడుతున్నామన్నారు. కానీ 12 రోజులుగా ఎదురుచూస్తున్నా నేటికీ న్యాయం జరగలేదన్నారు. కనుకనే ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగిందన్నారు. తక్షణమే దాడి ఘటన మీద కేసు నమోదు చేయాలి. నిందితుడిని అరెస్ట్ చేసి జైలులో పెట్టాలి. అలాగే ఈ ఘటన మీద సుప్రీం కోర్టు రిటైర్డు జడ్జీ చేత విచారణ జరిపించి దీని వెనుక ఉన్న శక్తులను గుర్తించాలన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సహించేది లేదన్నారు. చీఫ్ జస్టిస్ పై దాడి విషయంలో న్యాయాన్ని కోరుతూ నవంబర్ 17న ఛలో ఢిల్లీ “దళితుల ఆత్మగౌరవ ర్యాలీ” నిర్వహిస్తామని, ఈ ర్యాలీలో ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకునే దళిత ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, భువనగిరి జిల్లా ఇన్చార్జి బిర్రు మహేందర్ మాదిగ, ఎంఎస్పీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజయ్య మాదిగ, భువనగిరి జిల్లా అధ్యక్షుడు నల్ల చంద్రస్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం మాదిగ, మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేపాక వెంకన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు, ఎంఎస్పీ జాతీయ నాయకులు మాచర్ల సైదులు మాదిగ, రాష్ట్ర నాయకులు ఎర్ర వీరస్వామి మాదిగ, ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు కురుపాటి కములమ్మ, ఎంఎస్పీ నల్లగొండ సూర్యాపేట జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ, మడుపు శ్రీనివాస్ మాదిగ, మాచర్ల సుదర్శన్, వంగూరి ప్రసాద్, గాదె రాజు, కారుపాటి అంబేద్కర్, నకిరేకంటి వెంకటరత్నం, బట్ట శ్రీను, నల్ల స్వామి, బాకీ వెంకన్న పాల్గొన్నారు.