రామగిరి, డిసెంబర్ 10 : మానవ హక్కులపై యువత, విద్యార్థులు అవగాహన పెంచుకుని వాటి పరిరక్షణలో కీలక భూమిక పోషించాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు మాజీ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. నల్లగొండలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మానవ హక్కులు అంటే ప్రతి మనిషికి పుట్టుకతోనే లభించే హక్కులు అన్నారు. హక్కుల పరిరక్షణలో పోలీస్ పాత్ర కీలకమన్నారు. జీవన హక్కు, విద్యా హక్కు, మాట స్వేచ్ఛ, న్యాయం పొందే హక్కు, వివక్షను నిరాకరించే హక్కు వంటి అనేక హక్కులు ఉన్నాయన్నారు. ఈ హక్కులు రక్షించబడితేనే మనిషి సంపూర్ణ వ్యక్తిత్వంతో ఎదగగలడన్నారు.
సమాజంలో ఎప్పుడైతే పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేస్తుందో అప్పుడే మానవుల అన్ని హక్కులను కాపాడేందుకు దోహదపడతాయని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండే విద్యార్థినీ విద్యార్థినులు తమ హక్కులను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలన్నారు. నల్లగొండ జిల్లా ఆర్టీఐ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యుడు, డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం విలువను, దాని ప్రతిఫలాల గురించి విద్యార్థినులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మంజుల, అధ్యాపకులు సాలయ్య, సునీత, వనజ, అజయ్ కుమార్ పాల్గొన్నారు.