మిర్యాలగూడ టౌన్, మార్చి 24 : మిర్యాలగూడ పట్టణంలోని ఎన్టీఆర్ పురపాలక దుకాణ సముదాయాల ఆస్తి పన్ను, అద్దె బకాయిలు వసూలు చేయాలని అలాగే మొదటి అంతస్తు షాపులను వేలం వేసి నిరుద్యోగులకు అప్పగించాలని ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వస్కుల మట్టయ్య అన్నారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట విలేకరులతో మాట్లాడారు. ప్రైవేటు నివాసాల ఆస్తి పన్ను వసూళ్లలో చూపిన శ్రద్ధ పురపాలిక దుకాణాల విషయంలో చూపకపోవడం సరికాదన్నారు.
మున్సిపల్ దుకాణాల ఆస్తి పన్ను కోట్లలో బకాయిలు ఉన్నాయని వాటిని కూడా అధికారులు వసూలు చేయాలన్నారు. పదేళ్ల క్రితం భవన సముదాయాల్లో మొదటి అంతస్తులు 99 దుకాణాలు నిర్మాణం జరిగినప్పటికీ ఇప్పటికీ అద్దెకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం కోల్పోతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కలెక్టర్ స్థాయి అధికారులు ఇన్చార్జిగా ఉన్నందున వెంటనే నిర్ణయం తీసుకుని మొదటి అంతస్తు దుకాణాలను అద్దెకి ఇవ్వాలని అన్నారు. ఆయన వెంట పోతుగంటి కాశి, శ్రీనివాస్, రాజేశ్ ఉన్నారు.