– నల్లగొండ జిల్లా సంక్షేమ అధికారి కె.వి.కృష్ణవేణి
నీలగిరి, ఏప్రిల్ 15 : చిన్నపిల్లల అభివృద్ధికి సరైన పోషకాహారం కీలకమని నల్లగొండ జిల్లా సంక్షేమ అధికారి కె.వి.కృష్ణవేణి అన్నారు. ‘8వ పోషణ పక్వాడ’ కార్యక్రమాన్ని చర్లపల్లి సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 9 నుండి 23 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా మాతా-శిశు పోషణ, ఆరోగ్య అవగాహనపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాట, కదలికలు, స్పందన ప్రతి చిన్నారిలో వయస్సు ప్రకారం గమనిస్తూ వాటిని అభివృద్ధి చేయాలన్నారు. ఆరు నెలలలో చిన్నారులు చిరునవ్వు, తిరగడం, సంవత్సరం లోపు పిల్లలు నడవడానికి ప్రయత్నం చేయడం, రెండు సంవత్సరాలలో చిన్న చిన్న మాటలు మాట్లాడటం వంటి విషయాలను ఎప్పటికప్పుడు గుర్తించాలన్నారు.
ఈ లక్షణాలు లేకపోతే వెంటనే తల్లిదండ్రులకు తెలియజేసి ఆ దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. తల్లిదండ్రులకు పిల్లలతో ఎక్కువగా మాట్లాడడం, ఆటలు ఆడించడం, ప్రేమగా చూసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. టీవీ / మొబైల్ ఎక్కువగా చూపించకుండా ఆటలు ఆడేలా, అక్షరాలు గుర్తుపట్టేలా వారికి నేర్పించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ సిడిపిఓ తూముల నిర్మల, సూపర్వైజర్ పార్వతీ, అంగన్వాడీ టీచర్లు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

‘పిల్లల అభివృద్ధికి సరైన పోషకాహారం కీలకం’