మునుగోడు, జూలై 23 : మునుగోడు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల బంద్ బుధవారం విజయవంతం అయినట్లు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు గోపగోని ఉదయ్, బొడ్డుపల్లి నరేశ్ తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ.. హాస్టల్ విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, అద్దె భవనాల్లోని హాస్టల్స్, గురుకుల పాఠశాలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజులు విచ్చలవిడిగా దోచుకుంటున్నారని, డొనేషన్ల పేరుతో, పుస్తకాలు, యూనిఫామ్, టై, బెల్ట్, డైరీలు అమ్ముకుంటూ నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే మంజూరు చేయాలన్నారు. విద్యార్థి లోకానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, సాయికృష్ణ, అనిల్, శివ, మనోజ్, ధనుంజయ్ పాల్గొన్నారు.