కట్టంగూర్, మే 15 : ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఆలస్యం జరకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి సమస్యలను రైతులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని, తేమ, తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెటోద్దని స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, మిల్లర్లు వెనువెంటనే దిగుమతులు చేసుకోవాలని సూచించారు. లారీ కొరత లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట తాసీల్దార్ పుష్పలత, సివిల్ సప్లయ్ డీటీ జ్యోతి, నాయకులు నంద్యాల వెంకట్ రెడ్డి, గద్దపాటి దానయ్య, చౌగోని రవి, ముత్యాల లింగయ్య, అనంతుల సైదులు ఉన్నారు.