రామగిరి, జనవరి 05 : ఆశా వర్కర్స్ గత మూడు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అలాగే లెప్రసీ సర్వే బిల్లులు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల డ్యూటీ డబ్బులు తక్షణమే చెల్లించాలని, సట్ సెంటర్ డ్యూటీలు రద్దు చేసి పని భారం తగ్గించాలనే డిమాండ్‌తో సోమవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఈ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. ఎన్హెచ్ఎం స్కీమ్‌లో జిల్లాలో 33 పట్టణ, గ్రామీణ ప్రాథమిక ఆర్యోగ కేంద్రాలతో పాటు జిల్లా హస్పిటల్, ఏరియా ఆస్పత్రులకు అనుబందంగా 1,480 మంది ఆశా వర్కర్స్ పనిచేస్తు ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నట్లు తెలిపారు. అయితే అతి తక్కువ వేతనంతో వారు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంతో అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వ వారి సమస్యలు పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. అంతే కాకుండా ప్రభుత్వం నిర్వహించే అనే కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఆశా వర్కర్లు కీలక పాత్రపోస్తున్నట్లు తెలిపారు. ఇంతగా కష్టపడి పనిచేస్తున్నా ఆశ వర్కర్లకు లెప్రసీ సర్వే బిల్లులు- 2022, 2023, 2024 ఏడాదికి ఒక ఆశా వర్కర్‌కు రూ.1,050 చొప్పున మొత్తం రూ.3,150 ఇవ్వాల్సి ఉందన్నారు. అన్ని జిల్లాలో ఈ డబ్బులు ఎప్పుడో వచ్చినా నల్లగొండ జిల్లాలో మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అదే విధంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల విదుల బిల్లు సహితం ఇవ్వలేదని తెలిపారు. తక్షణమే వీరి సమస్యలు పరిష్కారించాలని లేని పక్షంలో ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.

Ramagiri : ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కారించాలి : చిన్నపాక లక్ష్మీనారాయణ