తిరుమలగిరి, నవంబర్ 07 : తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షురాలు మిట్టపల్లి లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తిరుమలగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ పిలుపులో భాగంగా తిరుమలగిరి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య మాట్లాడుతూ… ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.
తిరుమలగిరి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించాలని కోరారు. మందుల కొరతను నివారించి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి అటెండర్ల సంఖ్య పెంచాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఏఎన్ఎం లను పర్మినెంట్ చేయాలన్నారు. తిరుమలగిరి ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వనం సోమయ్య, జి ఎం పి ఎస్ జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య, నాయకులు పానుగంటి శ్రీను, నలుగురి రమేశ్, పడమటింటి నగేశ్, పులిమామిడి భిక్షం పాల్గొన్నారు.