సూర్యాపేట, జూలై 8 (నమస్తే తెలంగాణ): జిల్లాలో మెడికల్ షాపుల యాజమాన్యాల అక్రమాలకు అం తేలేకుండా ఉంది. ఏ చిన్న నొప్పి వచ్చినా… జ్వరం వచ్చినా ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు ఇస్తున్నారు. చాలా మెడికల్ షాపుల్లో వయాగ్రా, మాన్ఫోర్స్, సువాగ్రా లాంటి గోలీలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో 70శాతం రోగులకు ఎమ్మార్పీ ధరలకే జనరిక్ మందులను అంటగడుతూ పెద్ద ఎత్తున డబ్బు పోగేసుకుంటున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ షాపుల్లో అయితే అనధికార దవాఖానలుగా చలామణి అవుతూ జబ్బేమిటో అడిగి కౌంటర్లో ఉండే వ్యక్తే చీటీ రాసి మందులు విక్రయిస్తుండడం గమనార్హం. ఇటీవల ఓ వ్యక్తికి ఇచ్చిన మందు వికటించడంతో హైదరాబాద్లోని పెద్ద దవాఖానకు తరలించి రూ.2.70 లక్షలు ఇచ్చి విషయం బయటకు పొక్కకుండా సెటిల్ చేసుకున్నట్లు తెలిసింది. జిల్లాలో ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నా డ్రగ్ కంట్రోల్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రగ్ కం ట్రోల్ అధికారులు ఏనాడూ ఒక్క మెడికల్ షాపును కూ డా తనిఖీ చేయకపోవడంతో అక్రమాలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ప్రధానంగా జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాల్లోని ప్రైవేట్ దవాఖానల్లో ఉన్న మెడికల్ షాపుల అక్రమాలైతే మరీ దారుణంగా ఉ న్నాయని పలువురు వాపోతున్నారు. ‘మేము రాసే మందుల వల్లే రోగాలు తగ్గుతాయి… ఆ మందులు మా దవాఖానలోనే దొరుకుతాయి… మా దవాఖానలోని మెడికల్ షాపులోనే తీసుకోవాలని’ ప్రైవేట్ దవాఖానలకు వెళ్లే రోగులకు డాక్టర్లు ముందే చెబుతారు. ఆ మెడికల్ షాపుల్లో కూడా అతి తక్కు వ ధరలకు లభించే జనరిక్ మందులను ఎమ్మార్పీ ధరలకే విక్రయిస్తున్నారు. జ్వరం గోలీలు బయట కొనుగోలు చేస్తే వంద రూపాయలు.. అదే జనరిక్ అయితే కేవలం 15 రూపాయలకే లభిస్తుంటాయి. అంటే ప్రైవేట్ దవాఖానల్లోని మెడికల్ షాపుల దోపిడీ ఏ రీతిన ఉందో అర్థం చేసుకోవచ్చు.
మెడికల్ షాపు కౌంటర్లో ఆర్ఎంపీ డాక్టర్లు
సాధారణంగా డాక్టర్ చీటీ రాస్తే మెడికల్ షాపులకు వెళ్లి కొనుగోలు చేయడం రివాజు. కానీ సూర్యాపేటలో మాత్రం అనధికార దవాఖానలుగా మెడికల్ షాపులు నడుస్తున్నాయి. చాలా సంవత్సరాలుగా జిల్లా కేంద్రంలోని కొన్ని మెడికల్ షాపులు అమాయక ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నాయి. గ్రామాల్లో ఆర్ఎంపీలతో లింకులు పెట్టుకొని రోగాలు వచ్చిన వారిని నేరుగా తమ మెడికల్ షాపులకు వచ్చేలా చూసి ఇష్టారాజ్యంగా యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్లు ఇచ్చి తాత్కాలిక ఉపశమనం కలిగేలా మందులు ఇస్తున్నారు.
కానీ ఆ మందులతో తమ ఆరోగ్యం క్షీణిస్తోందని అమాయక ప్రజలు గుర్తించడం లేదు. వాస్తవానికి జ్వరం వస్తే కనీసం మూడు, నాలుగు రోజులు డోస్ తీసుకొని రోగం తగ్గించుకోవాలే తప్ప ఒకేసారి ఎక్కువ డోస్ వాడకూడదని డాక్టర్లు చెబుతున్నారు. వీటికి భిన్నంగా మెడికల్ షాపులో కౌంటర్లో ఉన్న వ్యక్తితో పాటు, ఏకంగా ఆర్ఎంపీని కూర్చోబెట్టి జబ్బేమిటో తెలుసుకొని మందులు రాసి ఇచ్చి పంపిస్తున్నారు. ఇటీవల కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ మెడికల్ షాపు వద్ద ఆత్మకూర్.ఎస్ మండలానికి చెందిన వ్యక్తి ఒకరు తీసుకున్న మందు వికటించడంతో వెంటనే హైదరాబాద్కు తరలించి చికిత్స అం దించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
విషయం బహిర్గతం కాకుండా సదరు వ్యక్తితో పాటు ఆయన వెంట ఉన్న వారికి కలిపి రూ.2.70 లక్షలు ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాదాపు అన్ని మెడికల్ షాపుల్లో చీటీ లేకున్నా మందులు ఇస్తున్నారు. ప్రధానంగా డోస్ ఎక్కువ ఉన్న వయాగ్రా, మాన్ఫోర్స్, సువాగ్రా లాంటి గోలీలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. రాత్రి ఎనిమిది దాటిందంటే కొన్ని షాపుల్లో వీటికి డిమాండ్ బాగా ఉంటుం ది. కాలం చెల్లిన మందులను కూడా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అన్నింటికన్నా విచిత్రమైన విషయమేంటంటే మందులు కొనుగోళ్లకు సంబంధించి బిల్లులను ఎవరూ ఇవ్వరు. హోల్సేల్ వ్యాపారుల నుంచి కూడా మెడికల్ షాపులకు కూడా బిల్లులు లేకుండానే జీరో దందాతో మందులు అం దుతున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టించుకోవడంలేదని ఇందుకు కారణం నెలనెలా మామూళ్లు అందడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెడికల్ షాపుల అక్రమాలపై కొరడా ఝుళిపించాలని పలువురు కోరుతున్నారు.