నల్లగొండ ప్రతినిధి, జూన్ 24(నమస్తే తెలంగాణ) : సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో జఠిలంగా మారిన పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కార ముహూర్తం ఖారారైంది. అర్హులైన పోడు రైతులందరికీ ఈ నెల 30 నుంచి పట్టాలు అందించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గత ఫిబ్రవరి.. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మేరకు పట్టాల పంపిణీపై అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లాలో తుది జాబితాను రూపొందించి ప్రభుత్వానికి నివేదించింది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో 3,217 మంది రైతులకు 5,875 ఎకరాల మేర పట్టాలను సిద్దం చేసింది. వాటికి సంబంధించిన పట్టాదార్ పాస్‌పుస్తకాల ముద్రణను కూడా పూర్తి చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యవేక్షణలో స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో పట్టాల పంపిణీకి జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది.
పోడు భూములకు పట్టాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. పక్కా ప్రణాళికతో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదన్న ఉద్దేశంతో అత్యంత పారశదర్శకంగా వ్యవహరిస్తూ వచ్చింది. 2005 ముందు వరకు సాగులో ఉన్న రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలు రూపొందించి దరకాస్తులను స్వీకరించింది. దరకాస్తుల స్వీకరణ నుంచి మొదలు అర్హులైన వారిని గుర్తించే వరకూ పకడ్బందీగా వ్యవహరించింది. దరఖాస్తులను సంబంధిత పంచాయతీ కార్యదర్శి, ఆర్ఐ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లతో వేసిన కమిటీ పరిశీలించింది. తాసీల్దార్లు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి దరఖాస్తుదారుల నుంచి భూమి తాలూకు ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆధార్, అప్పటి ఓటర్ కార్డు వంటి పత్రాలను సేకరించి వాటిని ప్రత్యేక యాప్‌లో పొందుపర్చారు. పత్రాలు సక్రమంగా ఉన్న రైతుల సమక్షంలో క్షేత్రస్థాయిలో భూమి వద్ద వెళ్లి సదరు భూముల వివరాలు కూడా ఆన్లైన్లో నమోదు చేశారు. అటవీ శాఖ భూములకు ఆటంకం కలుగకుండా, అర్హత ఉండి ఏండ్ల తరబడి పోడు భూమిని సాగుచేసుకుంటున్న నిజమైన రైతులకు అన్యాయం జరుగకుండా పకడ్బందీగా వ్యవహరించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పలుమార్లు స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేసి స్వయంగా పర్యవేక్షించారు. గత నవంబర్ నుంచే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి ఒకటికి రెండు సార్లు సరిచూసి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేశారు. ఆ తర్వాత కూడా దశలవారీగా వస్తున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ వచ్చేలా..
నల్లగొండ జిల్లాలోని మొత్తం 13 మండలాల్లో పోడు భూముల సమస్య ఉండగా, ఫిబ్రవరి నాటికి ప్రాథమిక జాబితా సిద్ధం చేశారు. అప్పటివరకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా తొలుత 3,200 ఎకరాలకు సంబంధించి 1,971 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను సైతం అధికార యంత్రాంగం పరిగణలోకి తీసుకుంది. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరుగకూడదన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అన్ని దరఖాస్తులను పరిశీలించేలా ఆదేశాలిచ్చారు. దాంతో మరింత మంది అర్హులుగా తేలారు. ఫైనల్‌గా 2,928 మంది రైతులను పోడు లబ్ధిదారులుగా తేల్చారు. వీరికి 5,578 ఎకరాలను పంపిణీ చేసేందుకు పట్టాలు సిద్ధం చేశారు. ఇక సూర్యాపేట జిల్లాలోని పాలకవీడు, మఠంపల్లి మండలాల్లోనే పోడుభూముల సమస్య ఉన్నట్లు వెల్లడైంది. దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రాగా, వివిధ దశల్లో సమగ్ర విచారణ అనంతరం మొత్తం 84 ఎకరాలకు సంబంధించిన 84 మంది మాత్రమే నిజమైన పోడు రైతులుగా తేల్చారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 213 ఎకరాలకు గానూ 205 మంది రైతులతో తుది జాబితా సిద్ధం చేశారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 3,217 మంది రైతులకు 5,875 ఎకరాల పోడు భూములకు పట్టాలు సిద్ధమయ్యాయి.
రైతుబంధు, రైతుబీమా వర్తింపు
అర్హులైన వారి జాబితా సిద్ధం చేసిన అనంతరం పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణపై దృష్టి పెట్టారు. గ్రామాల వారీగా గుర్తించిన పోడు రైతుల వివరాలతో పాటు భూమి సరిహద్దులు సైతం నిర్ధారించారు. వీటన్నింటినీ ఫైనల్ చేసి పొందుపర్చిన అనంతరం కలెక్టరేట్లో పోడు పట్టాల నమూనాలను డౌన్లోడ్ చేసి మరోసారి చెక్ చేశారు. అన్నీ ఓకే అనుకుని ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో పాస్ పుస్తకాల ముద్రణకు చర్యలు తీసుకున్నారు. ఇలా ఇప్పటికే లబ్ధిదారుల పేరుతో పాస్ పుస్తకాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 30 నుంచి పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయగానే వెంటనే రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకం, ఆధారు కార్డు, బ్యాంక్ అక్కౌంట్ వివరాలు అందజేస్తే రైతుబంధు డబ్బులు నేరుగా పోడు రైతుల అక్కౌంట్లలో జమచేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఎకరానికి ఐదు వేల చొప్పున మొత్తం 2.93 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయంగా అందనున్నాయి. వచ్చే ఆగస్టులో రైతుబీమా పథకానికి అర్హలైన పోడు రైతులకు వర్తింపచేసేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఎన్నో ఏండ్లుగా జఠిలంగా ఉన్న పోడు భూముల సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభిస్తుండడంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమ కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు.