సంస్థాన్ నారాయణపురం, జూన్24 : ఎంతో మందిని ఉన్నత విద్యా వంతులుగా, ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దిన దేశంలోనే మొట్ట మొదటి సర్వేల్ గురుకులం నేడు పాలకుల, అధికారుల నిర్లక్ష్యంతో అధ్వానంగా తయారైంది. ఎంతో కష్టపడి చదివి సీటు సాధించి, ఎన్నో ఆశలతో సర్వేల్ గురుకులంలో అడుగుపెట్టిన విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిన రూ.20 కోట్లతో అన్ని హంగులతో నిర్మించిన నూతన భవనాలు ప్రారంభించడానికి ఉన్నతాధికారులు మీన మేషాలు లెక్కిస్తుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బాత్రూమ్లకు డోర్లు లేవు, నల్లాలు విరిగి పోయాయి. స్నానాలు చేయాలన్నా, వాష్ రూమ్‌కు వెళ్లాలన్నా అవస్థలే. కనీసం తాగడానికి మంచి నీటి వసతి కూడా కరువైంది. 100 మంది విద్యార్థులు పడుకునే హాల్లో ఫ్యాన్లు పనిచేయడం లేదు. 10 సంవత్సరల క్రితం తెచ్చిన మంచాలే ఉండడంతో అవి విరిగి పోయాయి. ఇక రేకుల రూముల్లో తరగతి గదులు నిర్వహిస్తుండడంతో ఎండవేడికి విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో పెచ్చులు ఊడిపడడంతో విద్యార్థులకు దెబ్బలు తగులుతున్నాయి. ఈ సమస్యలే కాకుండా కొన్నేండ్లుగా గురుకులంలో సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో గెస్ట్ ఫ్యాకల్టీలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. తాత్కాలిక టీచర్లు తూతూమంత్రంగా చెబుతున్నారని, వచ్చిన రెండు మూడు నెలలకు మించి ఉండకపోవడంతో పాఠాలు అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
సర్వేల్ గురుకులంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అలుమ్ని అసోసియేషన్ సభ్యులు అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో గురుకులంలో నూతన భవనాల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. గురుకులంలో అకాడమీ బిల్డింగ్, ఆడిటోరియం, వసతి గృహం, డైనింగ్ హాల్, గెస్ట్ హౌస్, స్టాఫ్ క్వార్టర్స్, కంప్యూటర్ డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, నాన్ టీచింగ్ స్టాఫ్ బిల్డింగ్‌లను కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా అన్ని హంగులతో నిర్మించారు. నూతన భవనాల నిర్మాణం పూర్తయి ఏడాది గడుస్తున్నది.
గత విద్యా సంవత్సరమే కొత్త భవనాలు ప్రారంభిస్తారని విద్యార్థులు ఎన్నో అశలు పెట్టుకున్నారు. అధికారులు రేపుమాపు అంటూ ఏడాది గడిపేశారు. ఈ విద్యా సంవత్సరం కచ్చితంగా ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు పాఠశాల ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా అందుబాటులోకి తీసుకురాలేదు. నూతన భవనాలను త్వరగా ప్రారంభించి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దూరం చేయాలని తల్లిదండ్రులు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. వసతుల కల్పనతోపాటు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సర్వేల్ గురుకులంలో పోయిన సంవత్సరం నా కొడుకు సీటు వచ్చింది. అందులో బాగా చదువుకుంటాడని అశపడ్డాం. గతంలో ఉన్న సర్వేల్ పాఠశాలకు ప్రస్తుతం ఉన్న దానికి అసలు పోలికే లేదు. పిల్లలకు ఏదైనా సమస్య వస్తే ఎవరిని అడుగాలో అర్థం కాని పరిస్థితి. ప్రిన్సిపాల్ సార్‌కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎత్తడు. ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పడు. బాత్రూమ్, వాష్‌రూమ్‌లకు డోర్లు లేవు. నల్లాలు లేవు. ఫ్యాన్లు పని చేస్తలేవు. పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొత్త బిల్డింగ్‌లను ప్రారంభించి విద్యార్థుల సమస్యలు తీర్చాలి.
– బొడ్డుపల్లి సత్యనారాయణ, విద్యార్థి తండ్రి, సంస్థాన్ నారాయణపురం